తెలంగాణ రాష్ట్ర సమితికి సభ్యత్వాలు సవాల్‌గా మారాయి. ఎన్ని సార్లు గడువు పెంచినా.. లక్ష్యాన్ని అందుకోవడానికి తంటాలు పడుతూనే ఉన్నారు., ముఖ్యంగా.. కేటీఆర్ ప్రత్యేక ఆసక్తి చూపించే గ్రేటర్ లో సభ్యత్వాలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. లక్ష్యానికి దగ్గరగా కాకుండా.. సుదూరంగా సభ్యత్వ వమోదు ఉండిపోవడంతో.. కేటీఆర్ ఎప్పటికప్పుడు ఫైరయిపోతున్నారు. గ్రేటర్ నేతలపై చిరాకు పడుతున్నారు. వారు… కింది స్థాయి నేతలపై అదే తరహా చిరాకు ప్రదర్శిస్తున్నారు. కానీ.. అసలు సభ్యత్వాలు మాత్రం ముందుకు కదలడం లేదు. చివరికి సభ్యత్వాలను బట్టే గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ టిక్కెట్లంటూ.. హెచ్చరికలు కూడా ప్రారంభించాల్సి వచ్చింది. ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకూ గడువిచ్చి… మళ్లీ సభ్యత్వ పుస్తకాలిచ్చి పంపించారు.
గ్రేటర్ పరిధిలో వంద మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ సభ్యత్వ నమోదులో ఆశించిన ఫలితాలు రాలేదు. గ్రేటర్ లో మరోసారి పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ఉంది. పార్టీ సభ్యత్వాన్ని ఎక్కువ నమోదుకు చేయించాలని భావించింది. దాదాపు కోటి మంది జనాభా ఉన్న రాజధానిలో పదిహేను లక్షలకు తక్కువ కాకుండా క్రియాశీల, సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టకున్నా టార్గెట్ రీచ్ కాలేక పోయింది. ఐదారు లక్షల వద్దే ప్రస్తుతం ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత్వ నమోదును గడుపులోపు పూర్తి చేయించాలని నగర మంత్రులను ఆదేశించారు.
గ్రేటర్ పరిధిలో చాలా మంది నేతలు కార్పోరేటర్లు సభ్యత్వ నమోదును అంతగా సీరియస్ గా తీసుకోలేద. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి కార్పోరేటర్లకు డివిజన్ల అభివృద్ది కోసం నిధులు కేటాయించలేదు. డివిజన్లలో కూడా ఎమ్మెల్యేలే పెత్తనం చెలాయిస్తున్నారు. సభ్యత్వాలను చేయించాలంటే ఆర్దికంగా భారం తమమీదే పడుతుందనే భయం కూడా కార్పొరేటర్లలో ఉంది.ఈ కారణాలన్నింటితో కార్పొరేటర్లు లైట్ తీసుకుంటున్నారు. గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ఎల్బీ స్టేడియంలో.. కేసీఆర్ సభ రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటం వెనుక కూడా.. కార్పొరేటర్ల నిరాసక్తత ఉంది. ఇప్పుడు సభ్యత్వాల్లోనూ వారు పవర్ చూపిస్తున్నారు.