ఈ వారం విడుదలైన బాబు బంగారం, తిక్క ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. వసూళ్ల పరంగా బాబు బంగారం కాస్త నయం. తిక్క పరిస్థితి ఘోరంగా ఉంది. బాబు బంగారంని వెంకీ ఫ్యాన్స్ ‘యావరేజ్’ అనుకొంటూ సంబర పడుతున్నారు. కానీ.. తిక్కకు అలాంటి రిపోర్ట్ ఏం లేదు. ముక్తకంఠంతో డిజాస్టర్ అని తేల్చేస్తున్నారు. కథల విషయంలో రెండు సినిమాలూ ఒకే తప్పు చేశాయి. తెలిసిన కథ (అందరూ నిర్ణయం సినిమాతో పోలుస్తున్నారు) బాబు బంగారంలో మళ్లీ వాడేస్తే.. తిక్కలో అస్సలు కథే లేదు. ఈ రెండు సినిమాలకూ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బకొట్టింది. భలే భలే మగాడివోయ్ సినిమాతో మారుతి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమా రూ.30 కోట్లకు పైబడి వసూలు చేసింది. దాంతో మారుతికి బాగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఉంటుంది. కథ లేకపోయినా సినిమాని నడిపించేసేయ్యగలను అనే నమ్మకం తీసుకొచ్చి ఉంటుంది. ఈ సినిమా కోసం మారుతి నమ్ముకొంది రెండు కామెడీ పాత్రలనే. వాటి కోసం జనం థియేటర్లకు రారు అనే విషయం ఈ సినిమా ఫలితమే నిరూపించింది.
స్టార్ హీరోయిన్ ఉన్నా సినిమా చూడాలన్న రూలే ముంది? కథలో ఆమె పాత్రకు న్యాయం జరక్కపోతే.. ఇక స్టార్ అనే వాల్యూకు ఉన్న అర్థమేమిటి? నయనతారని నమ్ముకొని చిత్రబృందం బాగా మునిగిపోయింది. నయనతార ఉంటే… జనాలు విరగబడి థియేటర్ కి వస్తారు అనుకొని పారితోషికం ఎక్కువైనా ఆమెని ఎంచుకొన్నారు. కానీ నయన మాత్రం అందరికీ చుక్కలు చూపించేసింది. ఇక ముందు నయనతార అనగానే వెంకీ భయపడడం ఖాయం. ఈ సినిమాలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యం, అందులో నయన చూపించిన నటనా విన్యాసాలు ఏమాత్రం గొప్పగా లేవు. ఇక నయనను ఎంచుకోవడం లో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. ఔ
ఇక తిక్క విషయానికొస్తే.. అందులో అన్నీ లోపాలే. కథే లేదనుకొంటే ఆ కథని నడిపించి విధానం భయంకరంగా ఉంది. సగం సినిమాకే అరడజను ఫ్లాపు సినిమాలు చూసినంత తలనొప్పి వచ్చేసింది. దర్శకుడు ఏం రాసుకొన్నాడో, ఏం తీద్దామనుకొన్నాడో ఎంతకీ అర్థం కాదు. స్క్రిప్టు విషయంలో ఏమరపాటుగా ఉంటే.. సినిమా ఫలితాలు ఇలానే ఉంటాయి అని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనం. వరుస హిట్లతో హీట్ మీదున్న సాయిధరమ్… ఆ హిట్లతో తన కొచ్చిన క్రేజ్ ఈ సినిమాతో పాడుచేసుకొన్నాడేమో అనిపిస్తోంది. డాన్సులు చేస్తేనే, రెండు మూడు డైలాగులు చెబితేనో, ఫైటింగులు చేస్తేనో జనాలు చూసేస్తారు.. సినిమాకి అంతకంటే కావల్సిందేం లేదు… అనే భ్రమలోంచి ఈ మెగా హీరో బయటపడాలి. లేదంటే ఇలాంటి ఫలితాలే మళ్లీ మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉంది.