సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. విజయవంతం అయింది. మంచి చిత్రంగానే పేరు తెచ్చుకుంటున్నది. అయితే ఈ చిత్రం చూసిన చాలా మందికి ఒక సందేహం కలుగుతుంది. కథ మొత్తం లండన్లో ఎందుకు జరుగుతుంది? మన దేశంలో ఎక్కడో ఒక చోట చూపిస్తే.. ఆ రిచ్నెస్ను తెర మీదికి తీసుకురావడం సాధ్యం కాదా? కుదురుతుందా? లేదా? అనేది ఆ ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న.. ఈ ఒక్క చిత్రం విషయంలోనే రేకెత్తేది కాదు. ఇటీవలి విజయం అత్తారింటికి దారేది కావచ్చు. అంతకంటె పాత ఫ్లాప్ ఆరెంజి కావచ్చు.. ఈ చిత్రాలకు నేపథ్యంగా దాదాపు చాలా వరకు విదేశాలనే ఎందుకు దర్శకులు ఎందుకు ఎంచుకుంటారో ప్రేక్షకులకు అర్థం కాని సంగతి.
అయితే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని లండన్ నేపథ్యంలో ఎందుకు తీయాల్సి వచ్చిందనే విషయమై దర్శకుడు సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో అనేక రకాల కారణాలను బయటపెట్టారు. ఈ కారణాల్లో ఆయన చెప్పిన కొన్ని అంశాలు మాత్రం.. మొత్తం భారతీయ సినిమా పరిశ్రమకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గురించి హెచ్చరించే విధంగా ఉన్నాయని చెప్పాలి. సుకుమార్ అనేక కారణాలు చెప్పినప్పటికీ ఒకదాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే.. అది యావత్తు భారతీయ సినిమా పరిశ్రమకు ప్రమాదం వంటి కారణం.
అదేంటంటే.. సినిమా షూటింగులకు సంబంధించిన అనుమతులు సంపాదించడం అనేది మనదేశంలో కంటె లండన్ లోనే ఎక్కువ అని సుకుమార్ వెల్లడించారు. ఒక్క లండన్ కాదు, విదేశాల్లో షూటింగులు చేసుకోవడానికి మన దర్శకులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుండడానికి ఇది ఒక కీలక కారణం అని పలువురు చెబుతుంటారు. మన దేశంలో షూటింగ్ అంటే అనుమతులకు ప్రభుత్వంలో ఉండే లంచగొండితనం, రెడ్టేపిజం అన్నీ కలిపి సినిమా చేయదలచుకున్న వారికి విరక్తి కలిగిస్తున్నాయి.
అందుకే ఇప్పుడు సుకుమార్ చెప్పిన పాయింటునుంచి మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కేసీఆర్, చంద్రబాబు వంటివారు చెబుతున్నట్లుగా వందల ఎకరాల భూములను ఇండస్ట్రియలిస్టులకు అప్పనంగా కట్టబెట్టేస్తే.. అది సినీ పరిశ్రమ వర్ధిల్లడానికి తోడ్పడుతుందని అనుకుంటే భ్రమ. కేవలం లంచాలకు, వేధింపులకు ఆస్కారం లేని విధంగా.. షూటింగులకు అనుమతులు ఇచ్చే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేస్తే చాలు.. స్వదేశీ సినిమాల తయారీకి స్వదేశీ కథలే మనకు తెరమీద కనిపిస్తాయని నమ్మవచ్చు. లేకపోతే కొన్నాళ్లకు అన్ని సినిమాల్లోనూ విదేశీ కథలే మనల్ని విస్మయపరచినా ఆశ్చర్యం లేదు.