పార్టీ నేతలంతా మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉంటే, మరోపక్క సీనియర్లు హైదరాబాద్లోని గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశం అజెండా ఏంటంటే… కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనేది! కాంగ్రెస్ పార్టీలో విధేయుల ఫోరమ్ అనేది ఒకటుంది. ఈ ఫోరమ్ లో మొదట్నుంచీ కాంగ్రెస్ లో ఉంటున్న నేతలు సభ్యులు! ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారు దీన్లో లేరు. వీళ్లంతా గతంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని తీర్మానిస్తూ హైకమాండ్ కి ఒక లేఖ రాశారు, ఇప్పుడు కూడా మరో లేఖ రాశారు. సీనియర్ నేత వీ హన్మంతరావు, శశిధర్ రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా తప్పుకుంటున్నారు కాబట్టి, అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని నేతలు చెబుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడినే పీసీసీ అధ్యక్షుడిని చేయాలంటూ హైకమాండ్ కి సిఫార్సు చేశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఆ నాయకుడి అనుభవాన్ని, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న విధేయతని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అంతేకాదు, న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కొంటున్న నాయకుల్ని ఎంపిక చేయరాదని ఫోరమ్ నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసమే పూర్తి సమయం కేటాయించగలిగేవారు, పార్టీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగలిగేవారు, వ్యాపార వాణిజ్యాలతో ఏమాత్రం సంబంధం లేనివారు, అన్నిటికీమించి పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేయాలంటూ ఓ లేఖ రాసి హైకమాండ్ కి పంపించారు.
ఈ లేఖ ఎవరిని ఉద్దేశించి రాశారో స్పష్టంగా అర్థమైపోతోంది. ప్రస్తుతం పీసీసీ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. అయితే, ఆయన్ని నియమించడం చాలామందికి ఇష్టం లేదు. అందుకే, రేవంత్ రెడ్డికి ఏయే పాయింట్లు అయితే అనర్హతలుగా మారతాయో వాటి ప్రస్థావనే విధేయుల ఫోరమ్ సిఫార్సుల్లో ఉన్నాయి. పార్టీలో అనుభవం అన్నారు… రేవంత్ కి అది లేదు. అందరి ఆమోదం అన్నారు… రేవంత్ నాయకత్వాన్ని అందరూ అంగీకరించడం అనుమానమే. కేసులతో ఏమాత్రం సంబంధం లేని నాయకుడన్నారు… రేవంత్ రెడ్డి కొన్ని కేసుల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వ్యాపార వాణిజ్యాలో అస్సలు సంబంధం లేకుండా ఉండాలన్నారు… అవి లేని నాయకులు ఎంతమంది ఉన్నారు, ఒకరో ఇద్దరో సీనియర్లు తప్పు! రేవంత్ రెడ్డికి ఇవ్వొద్దు అని మరోసారి తీర్మానించడం కోసమే విధేయుల ఫోరమ్ అత్యవసర సమావేశం వెనకున్న అజెండాగా కనిపిస్తోంది.