తిరుమల పింక్ డైమండ్ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణదీక్షితులు అది కనిపించకుండా పోయిందని.. జెనీవాలో వేలం వేశారని ఫోటోలు చూపిస్తూ ఆరోపణలు చేశారు. దాన్ని అందుకున్న అప్పటి ప్రతిపక్షం..ఇప్పటి అధికారపక్ష నేతలు… చంద్రబాబే కాజేశారని.. ఆయన ఇంటి కింద తవ్వాలని ఆవేశపడ్డారు. ఆ ఎపిసోడ్ అప్పుడు అలా ముగిసింది. అధికారం మారిన తర్వాత పింక్ డైమాండ్ల్లాంటివి ఏమీ లేవని అప్పటి ప్రతిపక్షంలో.. ఇప్పటి అధికారపక్షం వారే వాదించడం ప్రారంభించారు. కానీ.. దీన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని.. కొంత మంది డిసైడయ్యారు. ఆ పింక్ డైమండ్ సంగతి తేల్చాలని.. తిరుపతికి చెంది న్యాయవాది ఒకరు కేంద్ర విజిలెన్స్ కమిషన్కు లేఖ రాశారు.
పింక్ డైమండ్ ఉందా లేదా.. జెనీవా లో వేలం వేసిన వజ్రం తిరుమల శ్రీవారిదో కాదో సీబీఐ లేదా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో విచారణ జరిపించాలని ఆ న్యాయవాది కోరుతున్నారు. విదేశాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ చేయించాలని కోరుతున్నారు. అనేక కమిటీలు.. అనేక రకాలుగా.. శ్రీవారి ఆభరణాలపై నివేదికలు ఇచ్చాయని.. ఎవరి మాట ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పింక్ డైమాండ్ ఉందని..రమణదీక్షితులు ఫోటోలు కూడా చూపిస్తున్నారని ఆయన అంటున్నారు.
తిరుపతి లాయర్ ఈ లేఖ రాయడం వెనుక… అసలు పింక్ డైమండ్ ఆరోపణల వెనుక కథేమిటో తేల్చాలనే వ్యూహం ఉన్నట్లుగా చెబుతున్నారు. తిరుమల రికార్డుల్లో అసలు పింక్ డైమండ్ అనే పదమే లేదని కొంత మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ లబ్ది కోసం శ్రీవారిని వివాదాల్లోకి తెచ్చారని అనుమానిస్తున్నారు. రమణ దీక్షితులు అబద్ధం చెబుతుంటే ఎవరి ప్రోద్బలంతో చెబుతున్నారో కూడా తేలాల్సి ఉందని ఆ లాయర్ కోరుతున్నారు. మొత్తానికి పింక్ డైమండ్ వివాదం… ఆగేలా లేదు. దాన్ని చుట్టూ వివాదం సృష్టించిన వ్యవహారమూ ఎప్పటికైనా మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.