గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ సీనియర్ నేతలు..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. గతంలో.. కలిసి ఉండాలన్న కారణంగా.. కర్నూలు రాజధానిని త్యాగం చేశామని.. త్యాగాలను గుర్తించి ఇప్పటికైనా.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని.. పార్టీలకు అతీతంగా సీనియర్ నేతలంతా జగన్‌కు లేఖ రాశారు. రాయలసీమ నాలుగు జిల్లాలు మాత్రమే కాకుండా.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని ఈ నేతలు.. గ్రేటర్ రాయలసీమగా పేర్కొంటున్నారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు హర్షణీయమన్న నేతలు,… పరిపాలన వికేంద్రీకరణను సమర్ధిస్తున్నామని ప్రకటించారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్, రెడ్డివారి చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి ఈ గ్రేటర్ రాయలసీమలో రాజధాని డిమాండ్‌ను వినిపించారు. హైకోర్టులో ఓ బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల.. రాయలసీమ ప్రజలకు ఒరిగే లాభం కన్నా… సెక్రటేరియట్ ను విశాఖకు తరలించడం వల్ల ఎక్కువ నష్టం వస్తుందన్న అభిప్రాయం సీమ నేతల్లో ఉంది. అందుకే.. వారంతా.. రాజధాని కోసమే పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
టీజీ వెంకటేష్ లాంటి రాయలసీమ ఉద్యమ నేతలు.. విశాఖ సెక్రటేరియట్ ను ఒప్పుకోబోమని ప్రకటించారు. మూడు ప్రాంతాల మధ్య రాజధాని పంచాలని జగన్ చేసిన ప్రయత్నం.. కొత్త ప్రాంతీయ విబేధాలకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ముందు.. వివిధ ప్రాంతాల నుంచి మరిన్ని డిమాండ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.