తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన దళిత ముఖ్యమంత్రి హామీ తరహాలో… ఏపీ ప్రత్యేకహోదా విషయంలో నాలుక అడ్డంగా తిప్పేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకహోదాకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. తను, ఎంపీ కేకే,మరో ఎంపీ కవిత.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు.. అవసరం అయితే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తాను కేంద్రానికి లేఖ రాస్తానని కూడా ప్రకటించారు. ఈ మాటలు విని జర్నలిస్టులు కూడా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ప్రత్యేకహోదా విషయంలో టీఆర్ఎస్ చేసిన రాజకీయ విన్యాసాలు ఇప్పటిక ప్రజల కళ్ల ముందే ఉన్నాయి.
గతంలో మోదీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడాన్ని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోనే వ్యతిరేకించారు. గతంలో.. కవిత.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు పలికినా.. తీరా ఏ అంశంపై .. అయితే.. అవిశ్వాస తీర్మానం పెట్టారో.. అదే సమయంలో.. హ్యాండిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోనే కాదు. తెలంగాణ ఎన్నికల్లోనూ కేసీఆర్ .. టీఆర్ఎస్ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణ నష్టపోతుందని సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రచారసభలో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్నప్పుడు.. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలంతా.. బహిరంగసభల్లో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు కేసీఆర్.. అవసరం అయితే.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం లేఖ రాస్తామని చెప్పడం.. వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. బీసీల రిజర్వేషన్ల తగ్గింపు అంశం వివాదంపై మాట్లాడేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కేసీఆర్.. కొద్ది సేపు మినహా పూర్తిగా .. చంద్రబాబుపై ఎటాక్ కే సమయం కేటాయించారు. ప్రత్యేకహోదా అంశంలో.. కేసీఆర్ యూటర్న్ తీసుకోవడానికి కారణం.. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీని మెల్లగా ఫెడరల్ ఫ్రంట్ లోకి చేర్చుకోవడమేనన్న విశ్లేషణ ప్రారంభమయింది. ప్రత్యేకహోదా ఇస్తామన్న వారికే తమ మద్దతని వైసీపీ చెబుతోంది. ఇప్పుడు కేసీఆర్ అదే చెప్పడం… వైసీపీని కూటమిలో చేర్చుకోవడమేనని అంచనా వేస్తున్నారు.