అమెరికాలో స్థిరపడిన చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ హైకోర్టు అతని తీరును తీవ్రంగా పరిగణిస్తోంది. అతని వీడియోలను చూసీ చూడనట్లు ఉండటం.. కేసులు నమోదైనా పట్టించుకోకపోవడంపై సీబీఐ తీరును హైకోర్టు తప్పు పట్టింది. గురువారం ఈ అంశంపై జరిగిన విచారణలో శుక్రవారం సీబీఐ ఎస్పీ తమ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఎస్పీ హైకోర్టు ఎదుట హాజరయ్యారు.
అక్కడా ఆయన నిర్లక్ష్యం బయటపడింది. పంచ్ ప్రభాకర్ వీడియోలను డిలీట్ చేయాలని యూట్యూబ్‌కు లేఖ రాశామని సీబీఐ చెప్పింది. తమకు ఎలాంటి లేఖ రాలేదని యూట్యూబ్ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో సీబీఐ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌ను ఎవరో నడిపిస్తున్నారని స్టాండింగ్ కౌన్సిల్ సందేహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ను సంప్రదించామని.. గుర్తింపు దొరకడం లేదని సీబీఐ కారణం చెప్పింది. కానీ ఆయనను పట్టుకోవడానికి ఇప్పటి వరకూ సరైన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే పంచ్ ప్రభాకర్ అలియాస్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉంటారో ప్రవాసాంధ్రులు అందరికీ తెలుసు. ఆయనే స్వయంగా తన అడ్రస్ చెప్పుకుని ఏం చేసుకుంటారో చేసుకోమని సవాల్ కూడా చేశారు. గతంలో ఉపరాష్ట్రపతిపైనా దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ఢిల్లీలో కూడా కేసులు నమోదయ్యాయి.