విశాఖ వాసుల నెత్తిన విషవాయువు పిడుగేసిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ పునంప్రారంభానికి రెడీ అవుతోంది. ఏపీ ప్రభుత్వం కూడా చాలా కాలంగా.. ఆ సంస్థను మళ్లీ ప్రారభించడానికి తన వంతు సాయం చేస్తోంది. అయితే.. వివిధరకాల పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం లే్కపోవడం.. స్థానికులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూండటంతో పరిశ్రమ ప్రారంభం అంత సులువు కాదన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వంతో పాటు… ఎల్జీ సంస్థ కూడా వ్యూహం మార్చింది. అక్కడ ఇక ఎలాంటి పాలిమర్స్ ఉత్పత్తులు చేయబోమని.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు చేస్తామని ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం అంగీకరించినట్లుగా.. వెంటనే… ఆమోదించినట్లుగా సమాచారం లీక్ చేశారు.
ఎల్జీ సంస్థ మల్టీ నేషనల్ కంపెనీ. అనేక భిన్నమైన ఉత్పత్తులు చేస్తుంది. ప్రధానంగా ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రసిద్ధి పొందింది. సెల్ ఫోన్ల విషయంలో వెనుకబడినా.. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి గృహోపకరాణాల విషయంలో మేలైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎల్జీ సంస్థ పేరు జన బాహుళ్యంలో నానడానికి ఇదే కారణం. అయితే ఆ సంస్థ నేరుగా ప్రజలతో సంబంధం లేని వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటిలో పాలిమర్స్ బిజినెస్ ఒకటి. విశాఖలోని ప్లాంట్ తీవ్ర సమస్యల్లో ఇరుక్కోవడంతో ఎలాగైనా బయటపడాలన్న ఉద్దేశంతో ఆ ప్లాంట్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేస్తామంటూ ప్రతిపాదించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రభుత్వం అంగీకరించిందని అంటున్నాయి.
నిజానికి పాలిమర్స్ ఉత్పత్తికి.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి అసలు సబంధం ఉండదు. మొత్తంగా అక్కడి ప్లాంట్‌ను కూల్చివేసి.. కొత్తగా ఎలక్ట్రానిక్ ప్లాంట్ కట్టాల్సి ఉంటుంది. దానికి ఎల్జీ సిద్ధమయిందా అని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. కొత్తగా ప్లాంట్ పెడతామంటే… ప్రభుత్వాలు ఉచితంగా స్థలాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందని గుర్తు చేస్తున్నాయి. కానీ అక్కడే ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ పెడతామని ముందుకు రావడం.. ప్రభుత్వవర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. అయితే.. ఎలక్ట్రానిక్స్ పేరుతో.. మళ్లీ రసాయనాలు ఉత్పత్తి చేస్తారేమోనని స్థానికులు అనుమానపడటం సహజమే. అలాంటి అనుమానాలు ప్రారంభమైతే మాత్రం మళ్లీ ప్రజలు నిరసన వ్యక్తం చేసే ప్రమాదం ఉంది.