విశాఖ ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి తేలిక పడలేదని.. ఆ గ్రామాల్లోఇంకా స్టైరిన్ ప్రభావం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రులు , ఎంపీ విజయసాయిరెడ్డి బస చేసి.. ప్రజల్లో ధైర్యం నింపారని..చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నంతగా అక్కడ పరిస్థితి బాగుందా.. అంటే…పైకి చెబుతున్నంతగా వాతారవణం మెరుగుపడలేదని.. గ్రామస్తులు అంటున్నారు. దానికి తగ్గట్లుగానే అక్కడ కొంత మంది ఆక్సీజన్ అందక.. స్పృహతప్పి పడిపోతున్నారు. ఐదు గ్రామాల ప్రజలందరికి.. ఒక్కొక్కరికి పదివేలు నష్టపరిహారం ఇవ్వాలనుకున్న ప్రభుత్వం సర్వే కోసం గ్రామ వాలంటీర్లను పంపింది. అక్కడ ఇంటింటికి సర్వే చేస్తున్న వాలంటీర్లలో ఇద్దరు స్ప్రహ తప్పి పడిపోయారు. వారికి సరైన రీతిలో ఆక్సీజన్ అందలేదని.. గుర్తించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
రెండు రోజుల కింద… పాలిమర్స్ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ నుంచి వెళ్తున్న గూడ్స్ రైలులో లోకో పైలట్ , గార్డ్ స్పృహతప్పి పడిపోయారు. దానికి విషవాయువులే కారణం అని తేల్చారు. అయితే.. అధికారులు మాత్రం.. ఎక్కడా గాలిలో స్టైరిన్ లేదని ప్రకటించి.. గ్రామస్తులందర్నీ ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. వారిలో ధైర్యం నింపేందుకు మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి బసచేశారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్‌లతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వేర్వేరు గ్రామాల్లో బస చేశారు. అందరూ.. పందిరి మంచాల మీదే సేదదీరారు కానీ.. కనీసం నాలుగో అంతస్తులో ఉండేలా చూసుకున్నారు. విజయసాయిరెడ్డి నాలుగో అంతస్తు పెంట్ హౌస్ పక్కన పందిరి మంచం వేసుకుని ఫోటో షూట్ చేయించుకుని మరీ సేద దీరినట్లుగా..వేరే భవనం పై నుంచి తీసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
స్టైరిన్ వాయువు బరువైనది. అది ఎత్తుగా ఉండదు. కిందకు వచ్చేస్తుంది. కింద ఉండే ఆక్సీజన్‌ను పైకి పంపుతుంది. అందుకే.. గ్రామాల్లో చెట్లు.. కింద పూర్తిగా మాడిపోయాయి.పెద్ద పెద్ద చెట్లపై భాగాలు బాగానేఉన్నాయి. కానీ కింద మాత్రం మాడిపోయాయి. స్టైరిన్ ఎక్కడ ఉంటే.. అక్కడ ఆక్సీజన్ ఉండదు. ఆ ప్రాంతంలో నేల మీద తిరిగే వారికి ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామాలకు తిరిగి వస్తున్న ప్రజలకు.. ఇళ్ల తలుపులు తెరిచిన తర్వాత.. ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంత మంది స్పృహతప్పి పడిపోతున్నారు. వాంతులు చేసుకుంటున్నారు. స్టైరిన్ పూర్తిగా గ్రామాల నుంచి పోలేదని.. ఇంకా ఇళ్లలోనే తిష్ట వేసిందని.. నిపుణులు చెబుతున్నారు. మొత్తం సైరిలైజ్ చేస్తామని.. జీవీఎంసీ ద్వారా నీటితో శుద్ధి చేస్తామని అధికారులు ప్రకటించారు కానీ కొన్నిఇళ్లకు కూడా చేయలేకపోయారు. కానీ అందర్నీ గ్రామాల్లోకి తీసుకు రావాలనే ఉత్సాహం మాత్రం చూపిస్తున్నారు.
ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి… స్టైరిన్ ప్రభావం ఉన్నప్పటికీ.. గ్రామాల్లో నివసిరించాలంటూ.. అధికారులు ఒత్తిడి చేస్తూండటంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గ్రామాల ప్రజల్లో కనిపిస్తోంది. మూడు, నాలుగో అంతస్తుల్లో ఉన్న వారికి పెద్ద ఎఫెక్ట్ లేదు కానీ.. కింద ఉండే వారికి మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు స్టైరిన్ అక్కడ లేదని నిపుణులు నిర్ధారించే వరకూ.. న్యూట్రలైజేషన్ చర్యలు తీసుకోవాలని..గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రతను అర్థం చేసుకుని గ్రామస్తులకు న్యాయం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.