ఎల్ఐసీలో ప్రజలు పొదుపు చేస్తున్న మొత్తం అదాని కంపెనీలకు పెట్టుబడిగా మారుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రస్తుతం ఎల్ఐసీకి ఉన్న పెట్టుబడుల విలువ రూ.87,380 కోట్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఏడాది క్రితం ఈ మొత్తం కేవలం రూ.32,100 కోట్లు మాత్రమే. అంటే ఏడాదిలోనే రూ. 55వేల కోట్ల కన్నా ఎక్కువగా ఎల్ఐసీ సొమ్ము అదానీ గ్రూపుల్లోకి చేరిందన్నమాట. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఎల్ఐసీ అత్యధికంగా అదానీ గ్రూప్‌లోనే పెట్టుబడి పెట్టింది.
రెండేళ్ల నుంచి ఎల్ఐసీ మొత్తం ఏడు అదానీ లిస్టెడ్ కంపెనీల్లో ఐదు కంపెనీల షేర్లను పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో కొంటోంది. ఈ కొనుగోళ్ల ప్రభావంతో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కంపెనీలో ఎల్ఐసీ వాటా 10 శాతాన్ని మించిపోయింది. ఇతర సంస్థల్లోనూ అంతే. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను విక్రయిస్తున్నారు. కానీ ఎల్ఐసీ మాత్రం కొనేస్తోంది.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వాటి పోటీ వ్యాపార కంపెనీలతో పోలిస్తే అత్యధిక విలువపై ట్రేడవుతున్నాయి. అదానీ గ్రీన్ లాభంతో పోలిస్తే షేరు ధర 1,109 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ స్థాయిలో కాకపోయినా అన్ని అదానీ షేర్ల పరిస్థితి అంతే. ఏదైనా తేడా వస్తే మొత్తం కుప్పకూలిపోతుంది. ఏ విధంగానూ ఈ షేరు విలువలు అంగీకారయోగ్యం కాదని.. స్టాక్ మార్కెట్‌పై కనీస అవగాహన ఉన్న వారు కూడా సలహాలిస్తూంటారు. మరి ఎల్ఐసీ మాత్రమే ఎందుకంత పెట్టుబడి పెడుతుందో పెద్దలకే తెలియాలి. అదానీ గ్రూప్ విషయంలో ఏదైనా అనూహ్యమైనది జరిగితే.. ఎల్ఐసీనే తీవ్రంగా నేష్టపోతుంది. అదే జరిగితే ప్రజలకే నష్టం. ఎందుకంటే… అదంతా ప్రజల సొమ్మే మరి.