ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం ఒప్పించింది. దాదాపుగా రూ. 13,000 కోట్ల ఎల్ఐసి ఐడీబీఐలో పెట్టుబడులు పెడుతుంది. ఎల్ఐసి సొమ్ము అంటే.. పాలసీ హోల్డర్ల సొమ్ము. ఎల్ఐసి కి ప్రత్యేకమైన సొమ్మేమి ఉండదు. ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉంది. ఐడీబీఐ బ్యాంకు స్థూల మొండి బాకీలు 28 శాతానికి చేరాయి. క్రితం మార్చి ముగింపు నాటికి ఈ బ్యాంకు స్థూల మొండి బాకీలు రూ.55,588 కోట్లు. 2017 ఇదే మార్చి నాటికి రూ.44,753 కోట్ల మొండి బాకీలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,700 కోట్ల నష్టం వచ్చింది. ఈ బ్యాంకులో ప్రభుత్వానికి 81 శాతం వాటా ఉంది. ఇన్ని మొండిబాకీలు..నష్టాలు ఉన్న బ్యాంకులో… ఎల్ఐసి వాటా కొనుగోలు చేయమని ఎందుకు భారత ప్రభుత్వం ఫోర్స్ చేస్తోంది..?
ఐడీబీఐ సొమ్మును మింగిన కార్పొరేట్లెవరు..?
ఐడీబీఐ..అంటే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి నిధులు సమకూర్చే బ్యాంక్. కానీ ఈ బ్యాంక్ బడా కార్పొరేట్లకు రుణాలు ఇచ్చింది. వారెవరూ తిరిగి చెల్లించలేదు. రుణాలు తీసుకున్న వారు.. ఆ నిధులను దారి మళ్లించారు. దాంతో అవన్నీ మొండిబాకీలుగా మారాయి. ఐడీబీఐ నష్టాల్లో ఉంటే.. ఆ బ్యాంకును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎందుకంటే.. సంస్థలో మేజర్ షేర్ కేంద్ర ప్రభుత్వానిదే. ఐడీబీఐను కాపాడాలంటే.. మొదట ప్రభుత్వం చేయాల్సిన పని.. ఎందుకు నష్టాలొస్తున్నాయో .. ఆలోచించడం. ఆ బ్యాంకుకు నష్టాలు ఎందుకొస్తున్నాయంటే.. బడా కార్పొరేట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వల్ల. కానీ విచిత్రం ఏమిటంటే.. ఐడీబీఐ దగ్గర రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన బడా కార్పొరేట్ల పేర్లు చెప్పడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. అంటే.. బడా కార్పొరేట్ల జోలికి వెళ్లడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు.. ప్రభుత్వం ఏం చేయాలి..? . ఆ నష్టాలను భరించాలి. నిజానికి ఇది కూడా ప్రజలపై భారమే. నిజమైన పరిష్కారం ఏమిటంటే… కార్పొరేట్లతో రుణాలను కట్టించాలి. కానీ చేయాల్సిన పనిని చేయకుండా ప్రభుత్వం ఆ భారాన్ని ఎల్ఐసిపై మోపే ప్రయత్నం చేస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఐడీబీఐలో వాటా కొనుగోలు..!
ఐడీబీఐలో ఎల్ఐసి.. 51 శాతం వాటా కొనుగోలు చేస్తుంది. అంటే అర్థం ఏమిటి.. కార్పొరేట్ల మొండి బకాయిలను ఎల్ఐసి భరించాలి. ఎల్ఐసి భరించడమంటే.. ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకే నష్టం. కార్పొరేట్లు కొల్లగొట్టిన నిధుల గురించి పాలసీ హోల్డర్ల దగ్గర్నుంచి ఎందుకు నిధులు మళ్లించాలి..?
ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థ. అందులోని ప్రతి పైసా.. పాలసీలు కొనుగోలు చేసిన వారికే వర్తిస్తుంది. ఇలాంటి సంస్థలో నిధులు ఖర్చు చేయడానికి ఎవరితోనూ చర్చించకుండా.. కేంద్రం ఐడీబీఐ బ్యాంకులో వాటా కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ఐఆర్డిఎ నిబంధనల ప్రకారం ఎల్ఐసీ లేదా మరో బీమా సంస్థ ఏ కంపెనీలో కూడా 15 శాతం మించి వాటా కొనుగోలు చేయకూడదు. ఐడీబీఐలో వాటాను కొనుగోలు చేయాడనికి ఈ నిబంధనను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఎల్ఐసికి నష్టం రాకుండా చూడాల్సిన ఐఆర్డీఏ కూడా.. ఎల్ఐసికి నష్టం వచ్చేలా ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడులు పెట్టమని చెబుతోంది. అంటే ఐఆర్డీఏను ప్రభుత్వం ప్రభావితం చేస్తోంది.
కావాలనుకుంటే సొంత బ్యాంక్ పెట్టుకోవచ్చు కదా..!
ఎల్ఐసి సంస్థ గతంలో బ్యాంకింగ్ రంగంలోకి రావాలనుకుంది. బీమా, బ్యాంకింగ్ రెండు సారూప్యత ఉన్న అంశాలు కాబట్టి… ఆలోచించింది. కానీ… ఇప్పుడు ఉన్న బ్యాంకులే ఇబ్బందులు పడుతున్నందున.. కొత్తగా తాము బ్యాంకింగ్ రంగంలోకి రావడం ఎందుకని ఆగిపోయింది. కావాలంటే.. సొంత బ్యాంకు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఐడీబీఐ లో వాటా కొనుగోలు చేయడమే అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. వాటా కొనుగోలు చేయడమేంటే.. రేపట్నుంచి బ్యాంకుని ఎల్ఐసీనే నడిపించాల్సి ఉంటుంది. బీమా రంగంలో ఉన్న ఎల్ఐసి.. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెలవప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎలా నడిపిస్తుంది..?. ఎల్ఐసికి దాన్ని నిర్వహించే సామర్థ్యం ఉండదు. అయినా ప్రభుత్వం భారం ఎల్ఐసి మీదే వేయాలని డిసైడయింది.
అత్యంత సమర్థమైన కంపెనీ ఎల్ఐసి..!
ఎల్ఐసి గొప్పతనమేమిటంటే.. ఎల్ఐసీలో ఉన్న పాలసీ హోల్డర్లందరూ.. ఇప్పటికిప్పుడు… తమ డబ్బులు చెల్లించాలని అడిగారనుకోండి. వెంటనే ఎల్ఐసీ అందరికీ .. చెల్లించేసేంత నిధులు ఉన్నాయి. చెల్లించగా..ఇంకా ఎల్ఐసి వద్ద రూ. లక్ష కోట్లు మిగులుతాయి. భారతదేశంలో ఉన్న అత్యత్తుమ కంపెనీల్లో మొదట ఉంటుంది. 93 శాతం పాలసీలను క్లెయిమ్ చేస్తోంది. అమెరికా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీల్లో 40, 50 శాతం క్లెయిమ్స్ క్లియర్ చేయడమే కష్టమవుతోంది. ఇంత సమర్థవంతంగా నడుస్తున్న కంపెనీని.. ఐడీబీఐ అనే గుదిబండను ఎందుకు కడుతున్నారు..?
ఈ విధానం ఎల్ఐసికి ప్రమాదకరం..!
ప్రస్తుతం భారదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పది లక్షల కోట్లకుపైగా మొండిబాకీలున్నాయి. ఇందులో 25 శాతం 12 మంది పెద్ద కార్పొరేట్ సంస్థలే తీసుకున్నాయి. ఆదానీ, అంబానీల్లాంటి వాళ్లే.. డబ్బులున్నా… బ్యాంకులకు పంగనామాలు పెడుతున్నారు. నిరవ్ మోదీ, మాల్యాలు లాంటి వాళ్లు వేల కో్టలు తీసుకుని పారిపోతున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయడం లేదు. ఐడీబీఐలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎల్ఐసీ దివాలా తీయదు. ఎల్ఐసీకి ఉన్న మొత్తం పెట్టుబడుల విలువ రూ. ఇరవై ఐదు లక్షల కోట్లు. ఇందులో 20 లక్షల కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీలుగా ఉన్నాయి. అంటే సామాజిక రంగంలో పెట్టుబడులు పెడుతున్న ప్రభుత్వానికి లోన్లు ఇస్తున్నది ఎల్ఐసి. అంటే… ఐడీబీఐలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎల్ఐసికి పెద్దగా నష్టం రాదు. కానీ మనం వ్యతిరేకించాలి. ఎందుకంటే.. ఇలాంటి విధానాలు ప్రారంభమైతే..అవి ఎక్కడికైనా పోవచ్చు. దానికి వాణిజ్య బ్యాంకులే నిదర్శనం. రూ. 10 లక్షల కోట్లు.. నిరర్థక ఆస్తులుగా మారడమే కారణం. అందుకే ఈ విధానం ప్రమాదకరం. మొదట్లోనే వ్యతిరేకించాలి.