తెలంగాణ సర్కారు రైతుబంధు పథకం పేరిట ఎకరాకి రూ. 8 వేలు పెట్టుబడి అందిస్తున్న సంగతి తెలిసిందే. చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉండే చాలామంది కౌలు రైతుల సంగతి ఏంటనేదే ప్రశ్నార్థకంగా ఉంటూ వస్తోంది. ఈ పథకం ద్వారా కౌలు దారులకు వ్యవసాయ పెట్టుబడి కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్ము అందదు. దీంతో ఇప్పటికే కౌలు రైతులు తరఫున ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.
కౌలు రైతులకు పెట్టుబడి ఇవ్వాలంటూ కొంతమంది నాయకులు అంటున్నారనీ, ఎలా ఇయ్యాలి, ఏమని ఇయ్యాలి, ఏ పద్ధతిలో ఇయ్యాలి అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తానే ఒక రైతుని అనుకుంటే, ఈ సీజన్ లో ఆరోగ్యం బాలేకపోయి భూమిని ఎవరికో ఇస్తాననీ, ఆరోగ్యం కుదుటపడిన వెంటనే తానే వ్యవసాయం చేసుకుంటానని ఉదహరించారు. ఎవరి భూములను ఎవరు దున్నుతున్నాడో రాసుకుని కూర్చోవడం తప్ప ప్రభుత్వానికి వేరే పనిలేదా అన్నారు. అందుకే, పాసు పుస్తకాల్లో అనుభవదారు అనే కాలమ్ ని తీసి పారేయించాననీ, ఒక పట్టదారు మాత్రమే ఉంటాడని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో కౌలుదారులకు డబ్బులు ఇయ్యం అని స్పష్టం చేశారు. మిగతాది రైతు, కౌలుదారు మధ్య జరిగే ముచ్చటని అన్నారు. వాళ్లూవాళ్లూ ఇచ్చుకుంటారో మానుకుంటారో అది వేరే సంగతి అని తేల్చి చెప్పేశారు.
మొత్తానికి, రైతుబంధు పథకం విషయంలో కౌలుదారులకు ముట్టేదేమీ లేదని కేసీఆర్ స్పష్టం చేసేశారు. ఏదో ఒక మధ్యే మార్గం ఉంటుందని కౌలుదారులు ఎదురుచూస్తూ వస్తే.. ఇప్పుడు సీఎం ఇలా అనేశారు. ఎప్పుడో వైయస్ హయాంలో కౌలు రైతులు గుర్తింపులు కావడం ఇవ్వడం మినహా… ప్రభుత్వపరంగా వారికి చెప్పుకోదగ్గ లబ్ధి అందలేదనే చెప్పాలి. కనీసం ఈ రైతుబంధు పథకం ద్వారానైనా కొంత సాయం అందే అవకాశం ఉందని వారూ ఆశిస్తే… చివరికి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన స్పష్టత ఇచ్చేసింది. రైతుబంధు పథకం కింద వచ్చే సొమ్మును కౌలుదారుకు ఎంత ఇవ్వాలనేది భూయజమానే నిర్ణయిస్తాడని, అది ప్రభుత్వం పని కాదని చెప్పేశారు. ఇప్పటికే ఈ కౌలు రైతుల సమస్యల్ని పట్టుకుని ప్రతిపక్షాలు బాగానే విమర్శలు చేస్తున్నాయి. తాజా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి విమర్శలు పెంచే అవకాశం ఉంది. ఏదేమైనా, కౌలు రైతుల సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సి అవసరమైతే చాలా ఉంది.