ప్రయోగాత్మక సినిమాలు తీశాం అని చెప్పుకొనేవాళ్లు.. ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆడియన్స్, రివ్యూ రైటర్ల అభిరుచులకు, వాళ్లిచ్చే తీర్పులకు వంకలు పెట్టడం రివాజు. మేం మంచి సినిమానే తీశాం.. మీకే చూడ్డం రాలేదు అంటుంటారు. ఇప్పుడు ‘లై’ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమాకి ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ ఊపందుకొంది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమాని ఫ్లాప్‌గా తేల్చేశారు సినీ విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు. ఈ లోగా ‘లై’ సక్సెస్ మీట్ కూడా పెట్టేశారు. అయితే ఒక్కరి మొహంలోనూ హిట్ కళ లేదు. దానికి తోడు… ‘లై’ సినిమా ‘ఇలా చూడాలి..’ అంటూ కొన్ని షరతులు విధించారు. వేదికపై మాట్లాడినవాళ్లంతా సినిమా చూడాల్సిన పద్ధతులు వివరించడానికే ఎక్కువ సమయం తీసుకొన్నారు. `థియేటర్లో కూర్చున్నప్పుడు సెల్ఫోన్లు ఆఫ్ చేసేయాలట. మన కళ్లు తెరకు అంకితం చేసేయాలట. కను రెప్ప వేసినా… కొన్ని లాజిక్కుల్ని మిస్సయిపోతారని, ఆ తరవాత సినిమా అర్థం అవ్వడం కష్టమని హను రాఘవపూడి చెబుతున్నాడు. కనురెప్ప వేస్తే… ఏదో మిస్సయిపోతామన్న ఉత్కంఠత, అంతటి ఆసక్తి `లై` సినిమాలో ఉంటే… ఇంత డివైడ్ టాక్ రాకపోదును. సినిమా ఎలా చూడాలో.. ప్రేక్షకుడికి నేర్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇంతకంటే భయంకరమైన లాజిక్కులతో తీసిన సినిమాల్ని హిట్ చేసి చూపించారు. అందుకే ప్రేక్షకులకు కోచింగ్ క్లాసులు ఇవ్వడానికి బదులు.. తప్పు ఎక్కడ జరిగిందో కాస్త లోతుగా ఆలోచిస్తే బాగుంటుంది. భవిష్యత్తులో వాటిని రిపీట్ చేయకుండా.