స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో ప్రాణత్యాగం కలకలం రేపుతోంది. శ్రీనివాసరావు అనే ఉద్యోగి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా… బ్లాస్ట్ ఫర్నేస్లో పడి తాను ప్రాణ త్యాగం చేస్తున్నానని.. తన ప్రాణంతో అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలని కోరుకుంటూ తాను విధులు నిర్వహించే టేబుల్ మీద లేఖ రాసి పెట్టారు. ఆయన ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన ఐడీ కార్డు.. ఇతర సామాగ్రి కూడా… టేబుల్ వద్దనే ఉంచారు. ఈ లేఖ వ్యవవహారం తీవ్ర ఉద్రిక్తలకు కారణం అవుతోంది. లేఖ బయటపడినప్పటి నుండి శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నారన్న దానిపైనే పోలీసులు వెదుకులాట ప్రారంభించారు. అయితే ఆయన ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయినట్లుగా తెలుస్తోంది.
శ్రీనివాసరావు ఆచూకీపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరో వైపు ఈ వ్యవహారం సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం తరపున స్పందించే బాధ్యతను మంత్రి కొడాలి నానికి అప్పగించారు. ఆయనకు పూర్తి వివరాలు తెలుసో .. తెలియదో లేకపోతే… కాన్ఫిడెన్షియల్ సమాచారం వచ్చిందో కానీ.. శ్రీనివాసరావు చనిపోయినట్లుగా ప్రెస్మీట్లో మాట్లాడారు. దీంతో మరింత గందరగోళం ఏర్పడింది. సోషల్ మీడియాలో… కొడాలి నాని ప్రకటనపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అదే సమయంలో పోలీసులు శ్రీనివాసరావు ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నట్లుగా చెబుతున్నారు.
ప్రైవేటీకరణ విషయంలో… పోరాటానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని డిసైడయ్యారు. వారు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. రాజకీయ పార్టీల మీద ఆశలు పెట్టుకోవడం లేదు. రాజకీయ పార్టీల నేతలు మాత్రం… వారి విమర్శలు వారు చేసుకుంటున్నారు. కార్మికులు మాత్రం దేనికైనా తెగించడానికి సిద్ధమన్నట్లుగా పోరాడుతున్నారు. ఆ విషయం… శ్రీనివాసరావు వ్యవహారం తేలిపోయిందంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తేలిగ్గా తీసేయలేరని చెబుతున్నారు.