ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వ్యవస్థల్ని ఉపయోగించుకుని రాత్రికి రాత్రి మనుషుల్ని అపహరించుకుపోవడం లీగల్ గా మారిపోయింది. ఇక చంపేస్తామని బెదిరించి ఓ ఎమ్మెల్యేని పార్టీ మారేలా చేయడమే కాక అతనితో నానా బూతులు మాట్లాడించారని కూడా అంటున్నారు.. అయితే ఇప్పుడు పాము తన పిల్లల్ని తానే తింటుందన్నట్లుగా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా అదే ప్రాణభయం స్కెచ్ ను సొంత ఎమ్మెల్యేలపైనా ప్రయోగిస్తోంది వైసీపీ. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆందోళనతో ఇది స్పష్టమయింది.
ప్రతిపక్ష నేతలపై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని .. పెగాసస్ వాడుతున్నారని ఏపీ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా విమర్శలు ఉన్నాయి. ఓ సందర్భంలో మంత్రి కాక ముందు అమర్నాథ్ తాము నిఘా సాఫ్ట్ వేర్లు వాడుతున్నామని ప్రకటించారు కూడా. అయితే ఈ నిఘా ప్రతిపక్షాలపై కాకుండా ఇప్పుడు సొంత పార్టీ వారిపైనా పెడుతున్నారని తేలడం సంచలనంగా మారింది. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని .. పెగాసస్ ప్రయోగించారని సొంత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ఆయన ఆధారాలు బయటపెడతానంటున్నాు.
అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి బయట పడ్డారు కానీ.. చాలా మంది వైసీపీ నేతలు బయటపడటం లేదు. వారందరికీ తమపై నిఘా పెట్టారని స్పష్టంగా తెలుసని అందుకే తమ జాగ్రత్తలో తాముంటారని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర కు చెందిన ఓ కీలక నేత అలాగే.. రాయలసీమకు చెందిన మరో ముఖ్య నేత వ్యవహారాలపై చాలా కాలంగా నిఘా ఉందని.. అంటున్నారు. వారిద్దర్నీ ఫిక్స్ చేయడానికి రాజకీయంగా ప్రత్యర్థులతో తీవ్ర స్థాయి శత్రుత్వం తెచ్చి పెట్టేలా ఇప్పటికి వైసీపీ పెద్దలు చేయగలిగారంటున్నారు. . అదే జాబితాలో కనీసం అరవై మంది ఎమ్మెల్యేలపై నిఘా ఉందన్న అనుమానం వైసీపీలో ఉంది.
ఫోన్లు ట్యాప్ చేయడానికి బెంగళూరు చెందిన ఓ కంపెనీతో మాట్లాడుకున్నారని.. వారికి నగదు రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారని గతంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు పేరు ఇటీవలి కాలంలో డీజీపీ పదవి కోసం వినిపిస్తోంది. ఇదంతా ఈ నిఘా మహత్యమేనేనని చర్చ జరుగుతోంది. మొత్తంగా తనపై నిఘా పెట్టడం వైసీపీ ఎమ్మెల్యేలను అసహనానికి గురి చేస్తున్నా… మంచి సమయం కోసం వారు ఎదురు చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరందర్నీ ప్రాణభయం పేరుతో కట్టడి చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఆనం వంటి వారి నుంచి వస్తున్నాయి.