పాన్ ఇండియా సినిమా లైగర్. విజయ్ దేవరకొండ హీరో. పూరి జగన్నాధ్ దర్శకుడు. ఇద్దరూ మనోళ్ళే. అయితే ఈ సినిమా బాలీవుడ్ కలరింగ్ వచ్చేసింది. కరణ్ జోహార్, అపూర్వ మోహత లైగర్ నిర్మాణంలో వున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. ఒకొక్క పాట ఒకొక్కరితో చేయించారు. అవి కూడా అస్సల్ తెలుగు నేటివిటీకి సంబంధం లేనివి. షూటింగ్ అంతా ముంబైలో చేశారు. ప్రమోషన్స్ కూడా అక్కడే మొదలుపెట్టారు. నిజానికి తెలుగుకి పాన్ ఇండియా కొత్త కాదు. లైగర్ వచ్చేసరికి ఇది తెలుగు సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కూడా విజయ్ దేవరకొండ .. ఇది పక్కా తెలుగు సినిమాని నొక్కి వక్కాణించాడు.
”లైగర్ పక్కా తెలుగు సినిమా. అయితే హిందీలా కనిపిస్తుందనే చర్చ మన తెలుగు ఆడియన్స్ లో వుంది. దాన్ని నేను అర్ధం చేసుకుంటా. ఇందులో పాటలు చేసింది హిందీ కంపోజర్స్. షూట్ చేసినపుడు అప్పుడు వున్నది హిందీ వెర్షనే. పాటలు హిందీలో చేశాం. సినిమా మాత్రం పక్కా తెలుగు. హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేశాం. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమాని ఫీలౌతారు. లైగర్ మన సినిమా. మన సినిమాని ఇండియాకి చూపిస్తున్నాం” అని వివరణ ఇచ్చుకున్నాడు విజయ్.