ఈనెల 25న ‘లైగర్’ విడుదల అవుతోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆగస్టులో టాలీవుడ్ కి మంచి హిట్లు పడ్డాయి. ‘లైగర్’ కూడా హిట్టయిపోతే… ఈ యేడాది ఆగస్టుని ఎవ్వరూ మర్చిపోలేరు. నార్త్ లో ఇప్పటికే `లైగర్` మంచి బజ్ సంపాదించుకొంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, తొలి మూడు రోజులూ వసూళ్ల దుమ్ము దులిపేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
‘లైగర్’ రన్‌టైమ్ చాలా షార్ప్‌గా కట్ చేశాడు పూరి. 2 గంటల 20 నిమిషాల సినిమా ఇది. తొలి సగం.. 75 నిమిషాలూ, రెండో సగం 65 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇందులోనే ఫైట్లూ, 6 పాటలూ ఉన్నాయి. పూరి సినిమాల్లో పాటలకు ప్రాధాన్యం ఎక్కువ. అయితే సెట్లు పెద్దగా వేయడానికి ఇష్టపడడు. ‘లైగర్’ కోసం మాత్రం ముంబైలో భారీ సెట్లు వేయించాడు పూరి. ఆ సెట్స్ లో తెరకెక్కించిన పాటలు ఈసినిమాకి హైలెట్ గా నిలవబోతున్నాయని తెలుస్తోంది. పూరి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చుట్టే కథ నడుస్తుంది. ప్రతీ సీన్లోనూ హీరోనే కనిపిస్తుంటాడు. ‘లైగర్’ కూడా అదే ఫార్ములాలో సాగబోతోందని, విజయ్ దేవరకొండ లేని ఒక్క సీన్ కూడా ఈ సినిమాలో ఉండదని, ఆ క్యారెక్టరైజేషనే.. ఈ సినిమాని ముందుకు నడుపుతుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.