చిత్రసీమలో లైట్స్మెన్ గొడవ ముదిరి కాపాన పడుతోంది. వేతనాల కోసం, పనికి తగిన భత్యాల కోసం లైట్స్మెన్ నెల రోజులుగా పోరాడుతున్నారు. నిర్మాతల మండలితో ఎన్నిసార్లు సమావేశమైనా.. ఈ సమస్యకు తగిన పరిష్కారం లభించడం లేదు. దాంతో లైట్స్మెన్ సమ్మె బాట పట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని షూటింగులకు కూడా అంతరాయం కలుగుతోంది. ఈ ఎఫెక్ట్ రామ్ చరణ్ – బోయపాటి సినిమాపై కూడా పడింది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఇటీవల రామ్చరణ్ కూడా సెట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా సెట్లోనే లైట్స్ మెన్ గొడవకు దిగారు. ‘పారితోషికాల విషయంలో స్పష్టత వచ్చేంత వరకూ షూటింగ్లో పాల్గోం’ అంటూ సెట్లోనే నిరసన వ్యక్తం చేశారు. ప్రొడక్షన్ మేనేజర్లు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆఖరికి దానయ్య వచ్చి సర్దిచెప్పినా గొడవ ఆగలేదు. దాంతో చరణ్ షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో లైట్స్ మెన్ సమస్యపై నిర్మాతలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. వాళ్లింకా ఓ నిర్ణయానికి రాలేదు. పారితోషికం వ్యవహారం తేలకపోతే… ఇలాంటి సమ్యలు మరిన్ని ఎదురయ్యే ప్రమాదం ఉంది. లైట్స్మెన్లంతా ఒక్క తాటిపై వస్తే.. టాలీవుడ్లో షూటింగులు ఆగిపోవడం ఖాయం.