పవన్ కల్యాణ్ సినిమా అంటే ఆ రేంజే వేరు. వంద కోట్లు వసూళ్లు సాధించే స్టామినా ఉన్న హీరో ఆయన.సర్దార్ గబ్బర్‌సింగ్ కలక్షన్లు ఒక్కసారి గుర్తు చేసుకోండి.తొలిరోజే దాదాపు ఇరవై నుండి పాతిక కోట్లు దాకా సాధించింది. పవన్ రేంజ్ చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ? అందుకే పవన్‌తో సినిమా చేయడానికి నిర్మాతలంతా క్యూ కడుతుంటారు. క్వాలిటీ మేకింగ్ కోసం డబ్బులు వెదజల్లుతుంటారు.స్టార్ టెక్నీషియన్స్‌ని రప్పిస్తుంటారు.పాటల్ని ఇది వరకు ఎవ్వరూ చూడని లొకేషన్లలో గ్రాండ్‌గా తీయాలని తాపత్రయపడుతుంటారు. అయితే.. ఇవన్నీ కాటమరాయుడుకి కట్ అయిపోయాయి. బడ్జెట్ కటింగ్ దృష్ట్యా కాటమరాయుడు సినిమా వెలవెలబోతోందని విశ్వసనీయ వర్గాల టాక్. ఈ సినిమాని ఓ మీడియం రేంజు బడ్జెట్ సినిమాగా తీస్తున్నారని, ఎక్కడకక్కడ ఖర్చుని అదుపులో పెట్టడానికి చిత్ర బృందం నానా తిప్పలూ పడుతోందని టాక్.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ద్వితీయ శ్రేణి వర్గంతో పని లాగించేస్తున్నారు. పవన్ సినిమా అంటే ఏ దేవిశ్రీ ప్రసాద్నో, మణిశర్మ రేంజు మ్యూజిక్ డైరెక్టర్‌నో తీసుకోవాలి. కానీ చిత్రబృందం అనూప్‌తో సరిపెట్టింది. దానికి కారణం బడ్జెట్ లేకపోవడమే. పవన్ తమ్ముళ్లుగా పేరున్న హీరోల్ని తీసుకోవాలని ముందు అనుకొన్నారు. దర్సకుడు డాలీ మనసులో రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలున్నారు. కానీ శరత్ మరార్ మాత్రం సినిమాల్లేని శివ బాలాజీనీ, అసలు పారితోషికం అడగని కమల్ కామరాజు లాంటి వాళ్లని తీసుకొన్నారు.ఒక్క హీరోయిన్ విషయంలోనే రాజీ పడక… కోటి రూపాయలు పారితోషికం ఇచ్చి శ్రుతి హాసన్‌ని తీసుకొన్నారు. మిగిలిన కాస్టింగ్ అంతంత మాత్రమే. పైగా వాళ్లకు ఇస్తున్న పారితోషికాలూ అంతంత మాత్రమే అని తెలుస్తోంది. ”మీరు పారితోషికాల గురించి పెద్దగా ఆలోచించకండి. పవన్ సినిమాకి పనిచేస్తున్నామనుకోండి” అంటూ అదేదో దేశాన్ని ఉద్దరిస్తున్నట్టు చిత్రబృందం బిల్డప్ ఇస్తున్నట్టు సమాచారం. `సర్దార్ గబ్బర్‌సింగ్` సినిమాతో నష్టపోయిన బయ్యర్లని ఆదుకోవడానికి పవన్ ఈ సినిమా ప్లాన్ చేశాడు. అందుకే వీలైనంత తక్కువలో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.పారితోషికాల భారం తగ్గించడానికి స్టార్ల జోలికి వెళ్లడం లేదు. అంత వరకూ బాగానే ఉంది. కానీ మరీ ఇంత తక్కువ గా వ్యవహరించడం ఎందుకో అర్థం కాదు. ఈ రోజుల్లో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. క్వాలిటీ విషయంలో రాజీ పడిపోతే… ప్రేక్షకులు ఈజీగా తిప్పి కొడుతున్నారు. సినిమాని చుట్టేశారు… అని బాహాటంగానే చెప్పేస్తున్నారు. పవన్ లాంటి స్టార్ సినిమాని చుట్టేయడం నిజంగా ఆత్మహత్యా సదృశ్యమే . ఒకవేళ చిత్రబృందం ఇదే ఫార్ములా కంటిన్యూ చేసుకొంటూ వెళ్ళిపోతే ఎలా?… తమ అభిమాన హీరో సినిమా భారీగా ఉంటే బాగుంటుంది కదా అనే ఆవేదన అభిమాన సంఘాల ప్రముఖుల అభిప్రాయం లో వ్యక్తం అవుతోంది.