ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తే ‘బాహుబలి’ టైపులో రెండు భాగాలుగా తీయవచ్చు. లేదంటే మూడు నాలుగు ఐదు భాగాలుగానూ తీయవచ్చు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంలో ఎన్నో అద్భుత ఘట్టాలు వున్నాయి. ఆయన జీవిత చరిత్రలో ఎన్నో విశేషాలు వున్నాయి. ఒక్క సినిమాలో అవన్నీ చూపించాలంటే కుదరని పని. అందుకని, పలువురి పాత్రల నిడివిని కుదిస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రనీ కుదించార్ట. బసవతారకం పాత్రలో హిందీ నటి విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె, ముందుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిసి బసవతారకం గురించి తెలుసుకొని సెట్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆమె ఎన్ని రోజులు షూటింగ్ చేశారో తెలుసా? ఐదు రోజులు. మరికొన్ని రోజులు ఆమె షూటింగ్ చేయనున్నారు. అయితే… ఆమె పాత్ర వెండితెరపై ఎక్కువసేపు కనిపించదట. అలాగని, మరీ కనిపించీ కనిపించనట్టూ వుండదట. కనిపించేది తక్కువ సన్నివేశాల్లో అయినా ఎంతో ప్రభావం చూపేలా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశార్ట. సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు రెండున్నర గంటల్లో చూపించాలంటే కుదించక తప్పదు మరి.