అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రోత్సాహంతో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి నబం తుకి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సుప్రీం కోర్టు నిన్న ఇచ్చిన తీర్పుతో అది తొలగిపోయింది. రాష్ట్రంలో యధాతధ స్థితి కొనసాగిస్తూ, తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా గవర్నర్ ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ న్ని సుప్రీం కోర్టు నిన్న తిరస్కరించింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై యధాతధ స్థితిని కొనసాగించాలనే తన ఉత్తర్వులను కూడా ఉపసంహరించుకొంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రపతిని కోరింది.
కనుక కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకి సిద్దం అవుతున్నారు. మొత్తం 60 మంది సభ్యులుండే శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 47 మంది, బీజేపీకి 11మంది, ఇద్దరు స్వతంత్రులున్నారు. వారిలో 21మంది కాంగ్రెస్, 11మంది బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారంనాడు రాష్ట్ర గవర్నర్ రాజ్ ఖోవని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి తమ సంసిద్దత వ్యక్తం చేసారు. పరిస్థితులు చక్కబడటంతో త్వరలోనే మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు జరుగవచ్చును.
పైకి ఇదంతా సక్రమంగానే కనిపిస్తున్నప్పటికీ, ఈశాన్య రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంలో బీజేపీ ఈవిధంగా ప్రజా ప్రభుత్వాలను కూలద్రోయడం ఒక దుస్సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు అయ్యింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తూ, మళ్ళీ అదే పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్దం అవడం భ్రష్ట రాజకీయమే అవుతుంది. అధికారం చేజిక్కించుకోవడం కోసం ఒక మెట్టు దిగిన బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ లో అమలు చేసిన ఈ ఫార్మూలానే వేరే రాష్ట్రంలో కూడా అమలుచేసినా ఆశ్చర్యం లేదు.