లింగుస్వామి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. రామ్ తో ఆయన తీసిన ‘వారియర్’ విడుదలకు రెడీ అయింది. అయితే అన్ని అనుకున్నట్లు జరిగుంటే లింగుస్వామి తొలి తెలుగు సినిమా అల్లు అర్జున్ తో కావల్సింది. గతంలో ఒకసారి బన్నీ – లింగుస్వామి కాంబినేషన్ దాదాపు ఖరారైయింది. అయితే ఏవో కారణాల వలన ప్రాజెక్ట్ పక్కకు జరిగింది. కానీ లింగుస్వామి మాత్రం బన్నీతో తప్పకుండా సినిమా ఉంటుందని చెబుతున్నారు.
”బన్నీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా. కథలు గురించి మాట్లాడుతుంటాం. పదిహేను రోజులు క్రితం కూడా బన్నీని కలసి మాట్లాడా. మా ఇద్దరి కలయికలో తప్పకుండా సినిమా వస్తుంది” అని నమ్మకంగా చెప్పారు లింగుస్వామి. లింగుస్వామి మాస్ ఇమేజ్ వున్న దర్శకుడే. బన్నీ ఇమేజ్ తగ్గ సినిమా చేయగల ప్రతిభ ఆయనకి వుంది. అయితే ఇప్పుడు ఆయనకి ఒక హిట్ కావాలి. వారియర్ పైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు లింగుస్వామి. తమిళ్ లో కూడా ఆయనకి కొన్నాళ్ళుగా చెప్పుకోదగ్గ విజయం లేదు. ఇప్పుడు వారియర్ గనుక విజయం సాధిస్తే బన్నీ నుండి గ్రీన్ సిగ్నల్ రావాడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.