అరుకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విదేశీ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇంకోపక్క, అరుకు ప్రాంతంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే, అరుకు ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా కావడంతో, వీలైనంత త్వరగా కట్టుదిట్టమైన చర్చలు తీసుకుని, ఆ ప్రాంతంలో భద్రతకుఎలాంటి సమస్యా లేదనే విశ్వాసాన్ని పర్యాటకుల్లో కలిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
మరోపక్క… ఈ ఘటన జరిగి రోజులు గడుస్తూ ఉన్నా, మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోవడం కూడా చర్చనీయం అవుతోంది. నిజానికి మావోయిస్టులు ఏ చిన్న ఘటనకు పాల్పడినా… ఫలానా కారణంతో చేశామంటూ ఏదో ఒక కరపత్రం, లేదా ప్రకటన ద్వారా ఏదో ఒక దళం పేరుతో తెలియజేస్తూ ఉంటారు. అరుకు ఘటనపై ఇప్పటివరకూ అలాంటి ప్రకటన ఏదీ వెలువడక పోవడం కొంత చర్చనీయమే అవుతోంది. దీంతో అరుకు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కిలారు సర్వేశ్వరరావు హత్యకు పాల్పడ్డది అరుణ అనే మహిళా మావోయిస్టు. ఈమె మావోయిస్టు అగ్ర నేత చలపతికి భార్య!
ఈ చలపతి ఎవరంటే… గతంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన అలిపిరిలో జరిగిన దాడికి సంబంధించి ఈయన కీలకపాత్రదారి, ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. ఈయన భార్య అరుణ తాజా అరుకు ఘటనలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఈ ఘటనలో పాల్గొన్న అరుణ… పార్టీ ఎందుకు మారారు అంటూ ప్రశ్నించడంతోపాటు, పార్టీ మారేందుకు ఎంత తీసుకున్నారంటూ ప్రశ్నించారంటూ తెలిసిన సమాచారం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇది మావోయిస్టులకు సంబంధించిన అజెండా మేరకు జరిగిందా… లేదా, వీరి వ్యక్తిగత అజెండాలో భాగంగా ఈ దాడికి తెగబడ్డారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంకోటి, దాడికి పాల్పడ్డవారు మావోయిస్టు యూనిఫామ్ లో ఎందుకు రాలేదనీ, దాడి సమయంలో పార్టీలకు సంబంధించిన ప్రస్థావన ఎందుకు వచ్చిందనేదీ చర్చనీయం అవుతోంది.