జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో బహిరంగంగా చేసిన దోపిడి మద్యం, ఇసుక. అది కళ్ల ముందే ఉంది. మద్యం మొత్తం జె బ్రాండ్లు అమ్మారు. ఆ తయారు చేసిన కంపెనీలేవో టీడీపీ బయటపెట్టింది. ఎంతకు అమ్మారు… ఎలా అమ్మారు.. ఎంత నొక్కేశారో టీడీపీ, బీజేపీ కూడా బయట పెట్టాయి. ఇప్పుడు అధికారం చేతుల్లోకి వచ్చింది. జే బ్రాండ్లు ఆపేసినా దోపిడీని మాత్రం వెలికి తీసి ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడి… ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన వారిని వదలకుండా వెంటపడాల్సి ఉంది. ఎందుకంటే అదంతా బహిరంగంగా జరిగిన దందా. విచారణ చేస్తే జగన్ రెడ్డి సహా అందరూ దొరికిపోతారు.
ఇక ఇసుక గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇసుక రేణువు తమదేనని దోచుకున్నారు. అడ్డగోలు అధికారుల్ని నియమించి మొత్తం దోచుకున్నారు. ఓ సారి జేపీ సంస్థ అంటారు.. మరోసారి టర్న్ కీ అంటారు… అన్నీ పేపర్ల మీద ఉండే కంపెనీలే. అసలు దోపిడీ చేసింది మాత్రం వైసీపీ ప్రభుత్వ పెద్దలే. ఆ జేపీ కానీ.. ఈ టర్న్ కీ విషయంలో కానీ ఎన్నో అవకతవకలు ఉన్నాయి. అధికారుల అడ్డగోలు నిర్ణయాలు.. నిబంధనల ఉల్లంఘన ఉత్తర్వులు ఉన్నాయి. అంతకు మించి సుప్రీంకోర్టు తేల్చిన అక్రమాలు కూడా ఉన్నాయి.
అటు మద్యంలో కానీ ఇటు ఇసుకలో కానీ మొత్తం నగదు లావాదేవీలే నిర్వహించారు. ఎంత లెక్క చెబితే ప్రభుత్వానికి అంత రాశారు. ఈ విషయంలో ఆధారాలు కూడా సుస్పష్టం. ఇప్పుడు ఈ స్కాముల్ని బద్దలు చేయాల్సిన సమయం దగ్గర పడింది. పురందేశ్వరి మద్యం స్కాంను సీబీఐకి ఇద్దామని పదే పదే లేఖలు రాసినా ఇంకా స్పందన లేదు. ఇదంతా ప్రజాధనం. దోచుకున్న వారి గురించి ముందు ప్రజల ముందు పెట్టాలి. ఎలా దోపిడీ చేశారో వివరించాలి. ఇంకా ప్రభుత్వం ఆ ప్రయత్నం ప్రారంభించినట్లుగా కనిపించడం లేదు.