ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న మద్యం బ్రాండ్ల విషయం రాజకీయ సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు చాలా పక్కాగా మద్యం శాంపిల్స్‌ను టెస్ట్ చేయించారు. అందులో పూర్తి స్థాయిలో విష రసాయనాలు ఉన్నట్లుగా వెల్లడయింది. టీడీపీ నేతలు అలా ఈ రిపోర్టులు ప్రకటించగానే.. ఆయా బ్రాండ్ల మద్యంను తర్వాతి రోజు నుంచి అమ్మడం నిలిపివేశారు. దీంతో అందులో విష పదార్ధాలు ఉన్నాయని నిజం ఒప్పుకున్నట్లయింది. అదే సమయంలో ప్రభుత్వం మద్యం విషయంలో వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు నేరుగా మద్యం తయారీదారుల పేరుతో ఓ సంఘాన్ని తెరపైకి తెచ్చింది. వారు ప్రెస్ మీట్ పెట్ట్ పెట్టి అన్నీ కవర్ చేసేందుకు కొత్త కథలు చెప్పారు.
రేటు సరిపోకపోయినా ప్రభుత్వం నచ్చబట్టే సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నష్టానికి ఇవ్వాల్సిన అవసరం ఏమిటంటే మాత్రం నోరు మెదపలేకపోయారు. ఊరూపేరూ లేని బ్రాండ్లనే ఎందుకు అమ్ముతున్నారంటే.. సమాధానం చెప్పలేకపోయారు. విష రసాయనాలు లేవని మాత్రం చెబుతున్నారు. కానీ టీడీపీ నేతలు బయట పెట్టిన నివేదికల గురించి మాట్లాడటం లేదు. విష రసాయనాల బ్రాండ్లను ఎందుకు అమ్మడం లేదంటే.. కోడ్లు స్కాన్ కావడంలేదని.. ఎయిర్ టెల్ నెట్వర్క్ అని సమాధానం చెబుతున్నారు. ఇలాంటి పిట్టకథలతో నమ్మించాలనే ప్రయత్నాలను వారు తీవ్రంగా ప్రయత్నించారు.
కానీ తప్పుడు మద్యం బ్రాండ్లతో తాగుబోతుల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ముందు ముందు ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. ప్రభుత్వం మారితే.. ప్రజల ప్రాణాలను రిస్క్‌లో పెట్టేసినందుకు ఈ మద్యం బ్రాండ్ల తయారీదారులు దారుణమైన శిక్షణలు ఎదుర్కునే పరిస్థితి ఎర్పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది.