సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి శంకర్ నారాయణను తన పించన్ తీసేశారని నిలదీసి.. తన ఇంటివైపు వస్తే చెప్పుతో కొడతానన్న మహిళపై పోలీసులు మద్యం కేసు పెట్టే ప్రయత్నం చేశారు. కేసు పెట్టారో లేదో బయటకు రాలేదు. కానీ ఆమెను స్టేషన్కు తీసుకెళ్లారు. సొంత పూచికత్తుతో విడిచి పెట్టారు. శంకర్ నారాయణపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతి రోజే పోలీసులు ఈ చర్య తీసుకోవడం కలకలం రేపుతోంది.
ఎస్టీ వర్గానికి చెందిన ఆ మహిళ కూలీ పనులకు వెళ్తుంది. అలా కూలీ పనులకు వెళ్లిన దగ్గర ఓ ఇసుక దిబ్బలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం టెట్రా ప్యాకెట్లను కొన్ని పోలీసులకు దొరికాయి. అవి ఆమె పెట్టిందని పోలీసులు తీసుకెళ్లారు. దొంగ కేసులు పెట్టాలనుకున్న వారిపై పోలీసులు ప్రయోగించే ట్రిక్లాగే ఈ కేసు ఉండటంతో కలకలం బయలుదేరింది. మరెవరూ ప్రశ్నించకుండా ఈ మహిళను స్టేషన్లో కూర్చోబెట్టి విస్తృత ప్రచారం చేసి భయపెట్టడానికి కేసు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. పోలీసుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ మహిళ అసభ్యంగా తిట్టి ఉంటే.. అదేమైనా కేసు అయితే.. పెట్టుకోవచ్చు కానీ.. సంబంధం లేదని మద్యం కేసుల్లో ఇరికించాలనుకోవడం ఏమిటన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని.. దేనికైనా తెగిస్తామని విపక్ష నేతలు అంటూంటే… ఇప్పుడు సామాన్యులపైనా కేసులు పెడుతున్నారు. ప్రజలు తిరగబడితే పోలీసులు కూడా కాపాడలేరని శ్రీలంక పరిణామాలు నిరూపిస్తున్నాయని కొంత మంది గుర్తు చేస్తున్నారు. అయినా వైసీపీ నేతలకు అధికారం తమ సొంతంగా వచ్చిందని అనుకోవడం ప్రారంభించి చాలా కాలం అయింది. ప్రజలిచ్చిందే అని ఎప్పుడో మర్చిపోయారు.