ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. ప్రతీ ఏడాది ఇరవై శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. గత ఏడాదిలోనే మొదటి సారి ఇరవై శాతం.. తర్వాత లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరో పదమూడు శాతం దుకాణాలను తగ్గించారు. దాంతో ఈ సారి దుకాణాల తగ్గింపు జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. మామూలుగా అయితే మరో ఏడు శాతం అంటే.. మూడు వందల దుకాణాల వరకూ తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అదనంగా.. లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త ఎక్సైజ్ విధానంలో .. ఎక్సైజ్ కమిషనర్ అనుమతితో.. లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా 2,934 మద్యం దుకాణాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు నడుస్తున్నాయి. ఇక ముందు కూడా అలాగే నడుస్తాయి. లిక్కర్ మాల్స్‌ను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. పెద్ద పెద్ద దుకాణాలను అద్దెకు తీసుకుని వీటిని నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ మామూలు మద్యం దుకాణాల్లో పాపులర్ బ్రాండ్లను విక్రయించడం లేదు. దానికి కారణాలపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ మాల్స్ పెట్టాలనుకున్న ప్రభుత్వం అక్కడ మాత్రం అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
లిక్కర్ మాల్స్ ద్వారా మరింత ఆదాయం వస్తుందన్న ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం ఉంది. మద్యం విధానంలో లిక్కర్ మాల్స్ గురించి చాలా కొద్దిగానే చెప్పినప్పటికీ.. ఆదాయం పెంపులో భాగంగా ఎక్సైజ్ శాఖలో భారీగా కసరత్తు జరిగింది. కోరుకున్న బ్రాండ్లు దొరకకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న మద్యానికి ఏపీలో ఎక్కువ డిమాండ్ కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. దీన్ని అరికట్టడానికి లిక్కర్ మాల్స్ ఓ మార్గంగా భావిస్తున్నారు. ముందుగానే కసరత్తు జరుగింది కాబట్టి… ఒకటో తేదీ నుంచే లిక్కర్ మాల్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.