ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. తొలి రోజే.. మందుబాబులు కిలోమీటర్ల కొద్ది క్యూల్లో నిల్చోవడం.. లాక్ డౌన్ నిబంధనలు ఏమీ పాటించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఓ క్రమ పద్దతిని తీసుకు రావాలన్న ఉద్దేశంతో మద్యం అమ్మకాల్ని తాత్కలికంగా నిలిపివేయాలని ఆదేశించారు టోకెన్ పద్దతిని ప్రవేశ పెట్టి రద్దీ లేకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుని.. కొత్త విధివిధానాలతో నేడు లేదా రేపు.. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. అదే సమయంలో.. ధరలను మరో యాభై శాతం పెంచాలని నిర్ణయించుకున్నారు.
రెండు రోజుల క్రితం.. వివిధ రకాల మద్యంపై పాతిక నుంచి 30 శాతం వరకూ పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు.. ధరను మరింతగా పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలపై మరో యాభై శాతం వడ్డించాలని భావిస్తుననారు. పెరిగిన ధరలతోనే అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ధరలు పెంచిదే.. సామాన్యుల వద్ద డబ్బులు లేక.. మద్యం దుకాణాల వైపు రారని.. ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. మద్యం దుకాణాలను నాలుగో తేదీ నుండి పలు రాష్ట్రాలు తెరిచాయి. అయితే అన్ని రాష్ట్రాలు మద్యం ధరలను పెంచాయి. ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా 75 శాతం పెంచింది. ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ సర్కార్ నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ ఏపీ సర్కార్ కూడా.. మొత్తంగా 75 నుంచి 80 శాతం వరకూ మద్యం ధరలు పెంచేసింది. ఈ రోజు ఉన్న ధర మీద 50 శాతం పెంచింతే.. మొన్నటి దాకా ఉన్న ధరలతో పోలిస్తే.. ఎనభై శాతం పెరిగినట్లవుతుంది. డబ్బు లేని వాళ్లకు అందుబాటులో లేనంతగా ధరలు పెంచడాన్నే… మద్యనిషేధానికి తొలి అడుగుగా ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ ప్రకారం ఎనిమిది నెలల కిందటే.. దాదాపుగా ధరలను రెట్టింపు చేసిన సర్కార్.. ఇప్పుడు మరోసారి.. రెట్టింపు చేసింది. అయితే.. ప్రభుత్వం చెబుతున్నట్లుగా.. మద్యం వినియోగం తగ్గుతుందో లేదో కానీ.. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గడం లేదు. టీటీడీ హయాంలోని చివరి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన దాని కన్నా…గత ఆర్థిక సంవత్సరంలోనే ఎక్కువ వచ్చింది. ఆ రికార్డు ఈ ఏడాది చెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.