మద్యం కోసం ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న ఏపీ ప్రజలకు కొత్త ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుంచి ఎవరూ ఊహించనంత రిలీఫ్ ఇవ్వబోతోంది. ఆదాయం సంగతి పక్కన పెట్టి క్వాలిటీ లిక్కర్ ను… దోపిడీ లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ధరలను దాదాపుగా ఫైనలైజ్ చేశారని అంటున్నారు. తెలంగాణలో కన్నా తక్కువ ధరలకే అన్నిప్రముఖ బ్రాండ్లు అమ్మే అవకాశాలు ఉన్నాయి.
వైసీపీ హయాంలో సొంత మద్యాన్ని అత్యధిక ధరలకు అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. మద్యం అలవాటు ఉన్న మధ్యతరగతి ప్రజల కుటుంబాలు చితికిపోయాయి. మద్యం కోసం.. ఆదాయం సరిపోక .. భార్యాపిల్లల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. ఎన్నో కుటుంబాలు అలా చితికిపోయాయి. ఇప్పుడు మద్యం పాలసీ మార్చి ధరలు తగ్గిస్తే.. ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా లాగేసే కుట్రలకు చెక్ పెట్టనున్నారు.
ఎంత పాపులర్ బ్రాండ్ అయినా .. విదేశీ, ప్రీమియం కాకుండా ఫుల్ బాటిల్ విలువను వెయ్యిలోపే ఉంచే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున అక్రమ రవాణా అయ్యేది. ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చినా ఆశ్చర్యం లేని పరిస్థితి వస్తుంది. అయితే ఇంతగా తగ్గించడం వల్ల ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. ఎలా కవర్ చేస్తారన్నది తెలియాల్సి ఉంది.