ఆంధ్రప్రదేశ్లో మందు బాబులతో తాగడం మాన్పించాలని మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచేసిన ప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుగా ఉంది. షాక్ కొట్టేలా రేట్లు పెంచితే…ఆ మద్యాన్ని కొని షాక్ కొట్టించుకోకుండా… పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తాగుతున్నారని ఇప్పటికి గుర్తించింది. అందుకే.. బయట నుంచి కొని తెచ్చుకుని తాగడం ఎందుకు.. రేట్లు తగ్గిస్తాం.. ఆంధ్రలోనే కొనుక్కుని తాగండి అని బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోవడం.. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల మద్యం పెద్ద ఎత్తున ఏపీలోకి తరలి వస్తూండటంతో.. ఏపీ సర్కార్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీనికి పరిష్కారంగా మద్యం రేట్లు తగ్గించడమే అని నిర్ణయానికి వచ్చింది. ప్రీమియం, మీడియం బ్రాండ్ల మద్యం రేట్లను.. దాదాపుగా ఇరవై ఐదు శాతం వరకూ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేట్లు ఎందుకు తగ్గిస్తున్నామో.. ప్రభుత్వం జీవోలో తెలిపింది. మద్యం రేట్లు ఏపీలో ఎక్కువగా ఉన్న కారణంగానే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటున్నారని ..స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఎస్ఈబీ నివేదికల్లో వెల్లడించిందని ప్రభుత్వం చెబుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కేసుల వివరాలను కూడా జీవోలో వెల్లడించింది. చివరికి.. స్మగ్లింగ్ ను అరికట్టాడనికే ధరలు తగ్గిస్తున్నామని కవర్ చేసుకుంది. నిజానికి ఏపీలోకి మద్యం అక్రమ రవాణా జరగడానికి రేట్లు ఒక్కటే కారణం కాదు. మందు బాబులకు కావాల్సిన బ్రాండ్లు కూడా… దొరకకపోవడం మరో కారణం. ఓ బ్రాండ్ మద్యానికి అలవాటు పడిన వారు.. మరో మద్యం బ్రాండ్ ను ముట్టుకోరు. పైగా ప్రస్తుతం ఏపీలో అమ్ముతున్నవి ధరలోనే ప్రీమియం.. మీడియం బ్రాండ్లు. క్వాలిటీలో చీప్ లిక్కరే బెటరని చెప్పుకుంటూ ఉంటారు.
అయితే ప్రభుత్వం ఈ బ్రాండ్ల విషయాన్ని ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. కొద్ది రోజుల కిందట ప్రభుత్వం.. చీప్ లిక్కర్ ధరలను తగ్గించింది. ఇప్పుడు ఎక్కువ ధరలు ఉన్న మద్యం బాటిళ్ల ధరలను తగ్గించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం తన విధానాన్ని ఎలా సమర్థించుకుంటున్నది ఆసక్తికరం. మద్యం అలవాటును మాన్పించడానికే రేట్లు పెంచామని వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు రేట్లు తగ్గించడం ద్వారా… మద్యం తాగమని ప్రోత్సహిస్తున్నారా.. అన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.