బ్యాలెట్ ద్వారా జరిగినా.. ఈవీఎంల ద్వారా జరిగినా.. ఎన్నికలు… ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికే. పాలకులెవరో … తేల్చుకోవడానికే. అయితే.. ఆ పాలకులను ఎన్నుకోవడంతో పాటు.. తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడానికి.. తక్షణ పరిష్కారం కోసం… ఓ విజ్ఞప్తి పడేయడానికి.. ఈవీఎం కన్నా బ్యాలెట్ బాక్స్ ఎంతో వీలుగా ఉంటుంది. బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు జరిగే చోటా.. ఓటుతో పాటు.. తమ సమస్యలను వివరిస్తూ.. విజ్ఞాపనా పత్రాల్ని అందులో వేస్తూంటారు. ఇవి అప్పుడప్పుడూ హైలెట్ అవుతూ ఉంటాయి. తాజాగా.. తెలంగాణలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఓ లేఖ బయటపడింది. అదే.. మందుబాబుల గోడు..!
టాక్స్ పేయర్ల కష్టాలను గుర్తించరా..?
“జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు అసలు దొరకడం లేదు. పక్క జిల్లాకు వెళ్లి మరీ తాగాల్సి వస్తోంది. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి..” ఇది జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండంలో.. ఓ బ్యాలెట్ బాక్సులో దొరికిన విజ్ఞాపనా పత్రం. ఆ రెగ్యూలర్ టాక్స్ పేయర్… తను రెక్కలు ముక్కులు చేసుకుని సంపాదించిన దాన్ని టాక్స్ రూపంలో.. మద్యం ద్వారా కడుతున్నా.. ఆయనకు ఇష్టమైన మద్యం మాత్రం దొరకడంలేదు. అందుకే.. ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక… బ్యాలెట్ బాక్స్‌లో ఓటుతోపాటు వేశారు. అది కౌంటింగ్ సందర్భంగా బయటకు వచ్చింది.
సమస్య నిజమే..! బీర్లు దొరకడం లేదు..!
జగిత్యాల జిల్లా మందుబాబు.. బ్యాలెట్ బాక్సులో వేసిన లేఖ.. నిజంగానే సమస్య తీవ్రతను అర్థం పడుతుంది. బ్రాండెడ్ బీర్లు … జిల్లా కేంద్రాల్లో… అది కూడా.. చాలా పరిమితంగా మాత్రమే… లభ్యమవుతున్నాయి. మిగతా వన్నీ.. పెద్దగా పేరు లేని బ్రాండ్లే అమ్ముతున్నారు. మండిపోతున్న సూర్యతాపాన్నుంచి బీర్లు తాగి.. ఉపశమనం పొందాలనుకునేవారికి… ఇష్టమైన బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఓ స్కామేనని.. కావాల్సిన బీరు దొరకని ఫ్రస్ట్రేషన్లో వారు ఆరోపణలూ చేస్తున్నారు.
విపక్షాల విమర్శలకు… ఈ లేఖ ముడిసరుకు..!
బ్యాలెట్ బాక్సులో దొరికిన లేఖతో.. విపక్షాలు.. ప్రభుత్వంపై విరుచుకుపడటానికి ఓ అవకాశం దొరికినట్లయింది. తెలంగాణలో మద్యం వినియోగం.. రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. అయితే.. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు మాత్రం.. తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇవి ఈ లేఖ బయటకు రావడంతో మరింత పెరిగే అవకాశం ఉంది.