నవరత్నాల్లో అమ్మఒడి రత్నం ఇప్పటికీ అందలేదు. మరో రత్నం మద్య నిషేధాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్లో రూ. పదహారువేల కోట్లకుపైగా ఆదాయాన్ని అంచనా వేయడమే దీనికి సంకేతం. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతోంది. నాలుగో ఏడు ప్రారంభమవుతోంది. మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం… ఇప్పటికి అరవై శాతం దుకాణాలు తొలగించాలి. కానీ మొదట తగ్గించి..తర్వాత పెంచేశారు. ఎన్నికలకు వెళ్లే నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్ముతామని మేనిఫెస్టోలో పెట్టారు. అలా చేస్తారా లేదా అన్నదానిపై ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత ఇవ్వడం లేదు.
ఇప్పటికే మద్యంపై ఆదాయాన్ని వచ్చే ఇరవై ఐదేళ్ల పాటు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. మద్యంపై ఆదాయం ఆగిపోతే.. ఆ రుణాలకు చెల్లింపులు చేయలేరు. అంటే.. పాతికేళ్ల పాటు మద్యనిషేధం చేయకూడదని నిర్ణయించుకున్నారని అనుకోవాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం చెప్పడం లేదు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని చెప్పుకుటోంది. ఆ ఒక్క శాతం.. మద్యం నిషేధం కావొచ్చని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే సీపీఎస్ దగ్గర్నుంచి ఎన్నో అమలు కాని హామీలను అందరూ ప్రస్తావిస్తున్నారు. అన్ని వర్గాలు… ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చారన్న విమర్శలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. టీడీపీ హయాంలో చేసిన ఆరోపణల్ని నిరూపించలేకపోయారు. కులం విషయంలో ఓ కులంపై రెచ్చగొట్టేందుకు చేసిన తప్పుడు ప్రచారాలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇలాంటి సమయంలో హామీలుకూడా తప్పుడువేనని ప్రజలు భావిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తలు ఏం చేస్తారో వేచి చూడాలి !