రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బెల్ట్ తీసింది. ఉద్యమిస్తున్న మహిళా లోకానికి శుభవార్తే ఇది. ఈరోజు అర్ధరాత్రి నుంచే బెల్ట్ షాపులను రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రోడ్లపై ఎవరైనా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకోవాలనీ నిర్ణయించింది. ప్రభుత్వం, ప్రతిపక్షాల సవాళ్ళు కొంతమేరకు మంచే చేస్తున్నాయనిపిస్తోంది. ప్రతిపక్ష నేత ఏం కోరితే అది చేసేయడానికి బాబుగారు సిద్ధమై పోతున్నారు. జగన్ చెప్పిన నవరత్నాలు అర్థం పర్థం లేనివనీ, ఇప్పటికే తాము వాటిని అమలు చేస్తున్నామని చెప్పుకుంటోంది టీడీపీ.
ఏదీ ఏమైనా.. బెల్ట్ షాపులను రద్దు చేయడం చాలా మంచి నిర్ణయం. పల్లెలతో సహా పట్టణాల్లోనూ ఇప్పుడు మందుబాబులు రోడ్లపైనే ప్రత్యక్షమవుతున్నారు. అదేదో స్టైలన్నట్లు బీరు సీసాలు చేతిలో పట్టుకుని మరీ తిరుగుతున్నారు. మద్యం మత్తు తలకెక్కి ప్రమాదాలూ చేస్తున్నారు. ఒక మద్యం దుకాణం పరిథిలో చిన్న పాక మాదిరిగా వేసి, అమ్మే దుకాణాలను బెల్ట్ షాపులంటారు. సైకిళ్ళపై సైతం మందు సీసాలను తీసుకెళ్ళి అమ్ముతుంటారు. ఇలాంటి వాటివల్లే రోడ్లపై మద్యపానం మొదలైంది. కనీసం ఈ తరహా దృశ్యాలు కనిపించడం తగ్గుతాయని భావించవచ్చు. ఇక్కడే ఒక తిరకాసు కూడా కనిపిస్తోంది. ఇంటికే మద్యం సరఫరా చేయాలని కూడా ఇటీవలే ఎక్సయిజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. పనిలో పనిగా ఈ నిర్ణయాన్ని కూడా ఉపసంహరింపజేస్తే మంచిది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి