ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు తగ్గాయి అని చెబుతుంది. దానికి కేసుల వారీగా లెక్కలు చెబుతోంది. లిక్కర్ సేల్స్ ఇన్ని కేసులు గత ఏడాది అమ్ముడుపోయాయి.. ఈ ఏడాది అందులో సగమే అమ్ముడు పోయాయని చెబుతోంది. బీర్ సేల్స్ విషయంలోనూ.. అంతే. బీర్ల అమ్మకాలు దాదాపుగా 70 శాతం పడిపోయాయని ప్రకటించుకుంది. క్వాంటిటీలో మాత్రం…ప్రచారం చేస్తోంది కానీ.. వచ్చిన ఆదాయం గురించి మాత్రం చెప్పడం లేదు. ఇలా ఎందుకు చెప్పడం లేదంటే…ఆదాయం.. గత ఏడాది కన్నా ఎక్కువగా వుంది మరి..
తక్కువ బాటిల్స్ అమ్మినా రూ.వందల కోట్ల ఆదాయం ఎక్కువ..!
నవంబర్లో 23 శాతం లిక్కర్ అమ్మకాలు, 54శాతం బీర్ల అమ్మకాలు తగ్గాయని… ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇచ్చింది. కానీ ఆ నెలలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. ప్రభుత్వం చెప్పినట్లు 23 శాతం లిక్కర్ , 53శాతం తక్కువగా అమ్మకాలు జరిగినా..207కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. డిసెంబర్లో 24శాతం లిక్కర్, 60 శాతం బీర్ల అమ్మకాలు పడిపోయినప్పటికీ.. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆదాయం 74 కోట్లు ఎక్కువ వచ్చింది. జనవరిలో 21శాతం లిక్కర్, 54శాతం బీర్ల అమ్మకాలు తగ్గినా 26 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. కరోనా ప్రభావం వచ్చే వరకూ.. ఇలా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూనే ఉంది కానీ.. తగ్గలేదు. కానీ ప్రభుత్వం మాత్రం.. తాగేవాళ్లు తగ్గుతున్నారని ప్రకటనలు చేస్తోంది.
75 శాతం ధరలు పెంచిన తర్వాత ఖజానాకు మరంత కిక్కు..!
మద్యం ధరలను ఒకే సారి 75 శాతం పెంచిన ఏపీ సర్కార్.. మందు బాబులకు షాక్ కొట్టేలా పెంచామని..వారెవరూ మందు ముట్టుకోరని ప్రకటించుకుంది. కానీ మద్యం ధరలు పెంచిన తర్వాత కూడా.. ఆదాయం ఏ మాత్రం తగ్గడం లేదు. సగటున.. రోజుకు రూ. 40 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వంటి పెద్ద సిటీ ఉన్న తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలు ఈ స్థాయిలో లేవు. పైగా అక్కడా అన్ని రకాల బ్రాండ్లను అమ్ముతారు. దీన్ని బట్టి చూస్తే.. తాగేవాళ్లు తగ్గుతున్నారో లేదో చెప్పడం కష్టం కానీ..మందు బాబుల జేబులు మాత్రం గుల్ల అవుతున్నాయని చెప్పుకోవచ్చు.
మద్యానికి బానిసైన పేదలను పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వం..!
మద్యానికి బానిసలయ్యే వారు ఎక్కువగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లే ఉంటారు. రోజు కూలీ చేసుకుని కాస్త మద్యం తాగితేనే ప్రశాంతంగా నిద్రపట్టే వారు ఉంటారు. రోజుకు ఐదు వందలు సంపాదిస్తే.. ఓ వంద పెట్టి మద్యం తాగి.. నాలుగు వందలు ఇంట్లో ఇచ్చే కూలీలు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారంతా ఇప్పుడు తమ సంపాదన అంతా… మద్యందుకాణాలకే పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అమ్మే బ్రాండ్లను ఏ ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కొనుగోలు చేయడం లేదు. మద్యం దుకాణాల ముందు కనిపిస్తున్న వారంతా నిరుపేదలే. పేద ప్రజల కష్టాన్ని ప్రభుత్వం ఇలా.. మద్యాన్ని షాక్ కొట్టేలా చేస్తామని ప్రకటనలు ఇచ్చి లాగేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది రూ. ఇరవై వేల కోట్ల ఆదాయాన్ని మద్యం ద్వారా ఏపీ సర్కార్ పొందింది. ఈ ఏడాది రూ.30వేల కోట్లను పొందబోతోంది. మద్యం దుకాణాలు తగ్గిస్తే.. డబ్బులున్నవారు ఎక్కడ దుకాణం ఉంటే అక్కడకు పోయికొనుక్కుంటారు కానీ తాగడం మానేస్తారా..? ప్రభుత్వం విచిత్రమైన లాజిక్కులు చెబుతూ..పేదల శ్రమను మద్యం రూపంలో ఆదాయంగా మార్చుకుంటోందన్న విమర్శలు తీవ్రంగానే వస్తున్నాయి.