ఎన్నికల్లో మద్యం పంపిణీని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మద్యం అమ్మకాలను ఆపేస్తోంది. పన్నెండో తేదీ నుంచి నెలాఖరు వరకు.. మద్యం అమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లుగా మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో మద్యం, మనీ పంపిణీ ఉండకూడదనేది… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు సంకల్పం. ఇందు కోసం… ఆర్డినెన్స్ తెచ్చారు. నిఘా యాప్ కూడా ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఏపీలో మద్యం అమ్ముతోందే ప్రభుత్వం.
అంటే ఎన్నికల ప్రక్రియలో చొరబడే మద్యం అంతా ప్రభుత్వం సరఫరా చేసేదే. అలాంటప్పుడు.. ఇప్పటి నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకూ ప్రభుత్వం మద్యం అమ్మడం నిలిపివేస్తే.. అసలు పంపిణీ అనే సమస్య రాదుగా.. అనేది.. చాలా మంది నుంచి వస్తున్న సలహా. చాలా సింపుల్ా ఉన్నా ఇది ఆచరణీయమే. ప్రభుత్వం మద్యం అమ్మడం మానేసిన తర్వాత… ఏపీలో ఎక్కడ మద్యం బాటిల్ కనిపించినా అక్రమమే అవుతుంది. దాంతో.. అక్రమార్కులకు చెక్ పెట్టినట్లవుతుంది. అసలు మద్యమే అమ్మడం లేదు కాబట్టి.. బయట నుంచి అక్రమ మద్యం తేవాలనుకున్న వాళ్లు కూడా.. భయపడతారు. ఈ ఆలోచన చాలా పర్ఫెక్ట్ గా ఉంది.
అందుకే ప్రభుత్వం అమలు చేయడానికి సిద్దమయినట్లుగా తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు నిలిపివేయాలనే ఆలోచన లేదని నిన్నటిదాకా అనుకున్నారు. అయితే ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది కాబట్టి.. నిబంధనల్లో సీరియస్ నెస్ లేకుండా పోతోందన్న అభిప్రాయం.. వినిపించింది. ప్రభుత్వానికి నిజంగా ఎన్నికల్లో మద్యం ప్రవాహం ఉండకూడదనే చిత్తశుద్ధి ఉంటే మద్యం అమ్మకాలను నిలిపివేయాలని అంటున్నారు. ఈ అభిప్రాయాలను ప్రభు్తవం పరిగణనలోకి తీసుకుంది.