దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ఓన్లీ మచ్ లౌడర్ సీఈఓగా పనిచేస్తున్న విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకూ కీలక విచారణలు జరుపుతున్న సీబీఐ ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మంగళవారం నుంచి అరెస్ట్‌ల పర్వం మొదలైనట్టైంది. ఇందులో తెలుగు రాష్ట్రాల రాజకీయ లింకులు ఉండటంతో ఇక్కడ కూడా ఎక్కవ చర్చనీయాంశం అవుతోంది.
సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఈ కేసులో విచారణ జరుపుతోంది. తమ బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో విచారణ చేస్తున్నారని అంటున్నారు. బినామీలను ముందుపెట్టి అనధికారికంగా పెట్టుబడులు పెట్టి.. బ్లాక్ మనీనీ వైట్ చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు లభించిందని తెలుస్తోంది. అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీల గుట్టు రట్టు చేసే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో పలు సార్లు సోదాలు జరిపారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆయన వ్యాపార భాగస్వామిలుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమసాగర్ ఇళల్లోనూ సోదాలు నిర్వహించింది. ఈడీ పలువుర్ని ఢిల్లీలో ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అరెస్టులు ప్రారంభించడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రశ్నిస్తున్న వారిని కూడా అరెస్టులు చేసే అవకాశం ఉందన్న ప్రాచరం జరుగుతోంది.