హుజురాబాద్ ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి మద్యం దుకాణాల్లోనూ రిజర్వేషన్లు కల్పించడం. గౌడ్ సామాజికవర్గానికి పదిహేను శాతం మరో పది శాతం ఎస్సీలకు.. మరో ఐదు శాతం ఎస్టీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దుకాణాల వేలం పాటపెట్టలేదు. ఉన్న దుకాణాలకే గడువు పెంచారు. ఇప్పుడు వేలం పాటకు టైం ఫిక్స్ చేశారు.
అయితే ఉన్న దుకాణాలతో అయితే రిజర్వేషన్లు అమలు చేయడం కష్టమని అనుకున్నారేమో కానీ ఏకంగా 350కిపైగా కొత్త దుకాణాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఎక్కడెక్కడ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయో చూసి అక్కడ రెండో దుకాణానికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికి అయితే తెలంగాణ వ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలకు మాత్రమే వేలం పాట నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు వాటి సంఖ్య 2500 దాటి పోనుంది. మద్యం అమ్మకాల విషయంలో విపక్ష పార్టీ ఎన్ని విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తనదైన శైలిలోనే వెళ్తోంది. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా అమలు చేయడంతో ఈ సారి తెలంగాణలో మద్యందుకాణాల కోసం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలూ వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటినీ ప్రభుత్వం సమన్వయం చేసుకోవాల్సి ఉంది.