తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి.
ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి తెలంగాణలోని అన్ని వైన్స్ షాపులను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ ముగిసే వరకు అంటే మే 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు మద్యం దుకాణాలను క్లోజ్ చేసి ఉంచాలని ఆదేశించారు. శంషాబాద్ రిపోర్ట్ లో ఉన్న డ్యూటీ ఫ్రీ షాప్స్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్ లను మూసివేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల నిబంధనల మేరకు తమ ఆదేశాలను పాటించాలని..ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వైన్స్ షాప్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల వేళ గుట్టుచప్పుడు కాకుండా మద్యం రవాణా జరిగే అవకాశం ఉండటంతో అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచాలని ఆధికారులను ఆదేశించారు.