ఆంధ్రప్రదేశ్లో భౌతిక దూరం, మాస్కులు, కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, 40 రోజుల పాటు ప్రజలంతా ఉపాధి వదులుకుని ఇళ్లలోనే ఉండి చేసిన త్యాగం అంతా.. లిక్కర్ షాపుల పాలయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రారంభించింది. కానీ ఎక్కడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. వందల సంఖ్యలో మందుబాబులు.. లిక్కర్ షాపుల ముందు బారులు తీరారు. ఎవరూ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు. లిక్కలు షాపుల ముందు ఐదుగురు మాత్రమే ఉండాలన్న నిబంధనను అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఏ ఒక్కషాప్ ముందు శానిటైజర్ కూడా ఏర్పాటు చేయలేదు. వందల సంఖ్యలో అలా ఎంత దూరం ఉంటే.. అంత దూరం నిలబడి.. ఒకరినొకరు తోసుకునిప లిక్కర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.
ఇంత కాలం.. షాపుల ముందు మార్కింగులని.. అదని.. ఇదని ప్రభుత్వం పెట్టిన నిబంధనలు లిక్కర్ షాపుల ముందు పని చేయలేదు. ఏ ఒక్క నిబంధనను అధికారులు అమలు చేయలేదు. నడుపుతున్నవన్నీ ప్రభుత్వ మద్యం షాపులే. నిబంధనలు పాటించకపోతే దుకాణాలు మూసివేస్తామని అధికారులు గొప్పగా ప్రకటించారు. కానీ అన్ని చోట్లా.. ఉల్లంఘనలే చోటు చేసుకున్నాయి. ఒక్క చోట కూడా.. దుకాణం మూసివేయలేదు. కొన్ని చోట్ల మహిళలు ఆందోళనకు దిగడంతో.. మధ్యాహ్నం తర్వాత మూసేశారు.
వైరస్.. ఒకరి నుంచి ఒకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతుందన్న కారణంగా.. ఎవరితో ఎవరూ కాంటాక్ట్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాల ముందు మాత్రం… అలాంటి కాంటాక్ట్ లెస్ ప్రయత్నాన్ని చేయలేదు. గుంపులుగా ప్రయాణాలు చేస్తే… ఇబ్బందికరని బస్సుల్లోనూ సోషల్ డిస్టెన్స్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోకి పెద్ద ఎత్తున వస్తే.. వైరస్ వ్యాప్తి చెందుతుందని.. అందర్నీ సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. అయితే.. .ఇప్పుడు అలాంటి అవసరమే లేదని.. మద్యం దుకాణాల ముందు జనజాతరను చూస్తే తెలిసిపోతుంది. మొత్తంగా.. మద్యం దుకాణాలు తెరవడం వల్ల.. ఇంత కాలం ప్రజలు.. దేని కోసం.. తమ కష్టాన్ని త్యాగం చేశారో.. అది ఫలించకుండా పోవడం ఖాయంగా మారింది.