గల్ఫ్ నుంచి వచ్చే విమానాల్లో బంగారాన్ని చెప్పుల్లో.. మిక్సీల్లో..వాచీల్లో..బెల్టుల్లో ఇలా రకరకాలుగా స్మగ్లింగ్ చేయడం తరచూ చూస్తూ ఉంటాం. నేరుగా తీసుకొస్తే పన్ను ఎక్కువగా పడుతుందని.. ఇలా టాక్స్ కట్టకుండా..దేశంలోకి బంగారాన్ని తీసుకు వస్తారన్నమాట. దీని వల్ల పెద్ద ఎత్తున స్మగ్లర్లకు డబ్బులు మిగులుతాయి. ఈ తరహాలోనే ఇప్పుడు… ఏపీకి..పొరుగురాష్ట్రాలకు మధ్య స్మగ్లింగ్ జరుగుతోంది .అయితే అది బంగారం కాదు. మద్యం.. బ్రాండెడ్ మద్యం.
ఓ స్మగ్లర్…తన ఒంటి నిండా మద్యం బాటిళ్లు పెట్టుకుని..స్టిక్కర్ అంటిచేసుకుంటాడు. బెల్టు బాంబుల్లాగా. అలా అంటిచేసుకుని దర్జాగా..సరిహద్దులు దాటి వచ్చేస్తున్నారు. వారం రోజుల కిందట.. ఓ వ్యక్తి బైక్పై సిలిండర్ పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూంటే పోలీసులకు డౌట్ వచ్చింది. ఒకటి రెండు సార్లు ఆపి వివరాలు కనుక్కుంటే..గ్యాస్ బండ తీసుకెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. అదే పనిగా అటూ ఇటూ తిరుగుతూండటంతో.. ఓసారి డౌట్ వచ్చి చెక్ చేశారు. గ్యాస్ బండ తీసుకెళ్తున్నది నిజమే కానీ.. అందులో గ్యాస్ లేదు.. మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇలా ఒంటికి అంటించుకోవడం… సిలిండర్లలో పెట్టుకుని పోవడమే కాదు.. ఇంకా చాలా చాలా ఐడియాలు స్మగ్లర్ల వద్ద ఉన్నాయి. కొద్ది రోజుల కిందట కర్ణాటక వైపు నుంచి మల్లెపూల లోడుతో వస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు ఆపారు. బరువుగా ఉన్నాయని చూస్తే మధ్యలో మద్యం బాటిల్స్ ఉన్నాయి. కర్ణాటక,తమిళనాడు వైపు నుంచి నిఘా తక్కువగా ఉండటంతో… పెద్దఎత్తున మద్యం సరఫరా జరుగుతోంది. గ్రామాల్లో నుంచి ఆయా రాష్ట్రాలకు దారులు ఉండటంతో.. స్మగ్లింగ్ అరికట్టడం అసాధ్యంగా మారింది.
తెలంగాణతో సరిహద్దున ఉన్న జిల్లాల్లో అయితే.. మద్యం బాటిళ్లు… అదే పనిగా ఏపీలోకి వచ్చేస్తున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. పట్టుకుంటున్నారు. ఇలా పట్టుబడుతున్న వాహనాలు వేల సంఖ్యలోనే ఉంటాయి. ఇక పట్టుబడకుండా వెళ్లిపోతున్నవి ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. అసలు మద్యం కన్నా…పొరుగు రాష్ట్రాల మద్యమే ఎక్కువగా అమ్ముడవుతోందన్న అభిప్రాయం.. అంతటా ఏర్పడింది. కొంత మంది పోలీసులు కూడా.. కక్కుర్తి పడుతున్నారు. స్వయంగా పోలీస్ బాస్ సవాంగ్ కూడా…ఇదే విషయాన్ని అంగీకరించారు. యాభై మందికిపైగా పోలీసులపై ఇసుక,మద్యం అక్రమ రవాణా అంశాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ అని స్టిక్కర్లు అంటించుకుని.. బైకుల మీద కార్ల మీద… తమ పని తాము పూర్తి చేస్తున్నారు.
ఏపీలో అనేక మంది స్మగ్లర్లకు.. ఇప్పుడు మద్యం ప్రధాన ఆదాయవనరు. ఎందుకంటే..ఏపీలో మద్యం రేట్లు చాలా ఎక్కువ మాత్రమే కాదు.. కావాల్సిన బ్రాండ్లు దొరకవు. మందుబాబులు.. బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తారు. తమకు కావాల్సిన బ్రాండ్ కోసం..వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. అలా ఒక్క బాటిల్.. పొరుగు రాష్ట్రం నుంచి ఏపీకి తీసుకు వస్తే వెయ్యి రూపాయలు మిగులుతాయి. దీంతో ఎక్కువ మంది ఈ స్మగ్లింగ్ కు ప్రయత్నిస్తున్నారు. ఇక పలుకుబడి ఉన్న.. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ స్మగ్లింగ్ వెనుక ఉంటున్నారు. కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఓ జడ్పీటీసీ ఇంట్లోనే పెద్ద మొత్తం సరుకు దొరికింది. పట్టుబడుతున్న ఇతర చోటా మోటా నేతల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చివరికి బీజేపీ తరపున మచిలీపట్నం పార్లమెంట్ కు పోటీ చేసిన వ్యక్తి కూడా.. ఈ బిజినెస్లో దిగి..దొరికిపోయాడు. దొరికినవాళ్లే స్మగ్లర్లు…దొరకేదాకా మిగతా వారంతా దొరలే. కానీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్నదానిపై మాత్రం ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది.