పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన షాక్ నుండి తేరుకోక ముందే బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు మరింత పెరుగుతున్నాయి. 39మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీకి ఆ హోదా త్వరలోనే పోతుందా? ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ కు జైకొట్టబోతున్నారా…? అంటే పరిస్థితులు అవుననే కనిపిస్తున్నాయి.
ఉన్న 39మంది ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే మరణించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరిపోయారు. తాజాగా కేసీఆర్ కు షాకిస్తూ సీనియర్ నేత పోచారం కూడా కాంగ్రెస్ కు జైకొట్టారు.
అయితే, ఇది ఇంతటితో ఆగదని మరో 20మంది ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని బాంబ్ పేల్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం. కేసీఆర్ విధానాలే కేసీఆర్ పార్టీని ముంచాయని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా తప్పా ఆ పార్టీలో ఎవరూ మిగిలే పరిస్థితి లేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావుతో కలిసి బీజేపీకి వెళ్లేందుకు కూడా ఆలోచిస్తున్నారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజులుగా వ్యూహాకర్త సునీల్ కనుగోలు, సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై చర్చించారని… ఎవరు చేరబోతున్నారు, ఎప్పుడు ఏ నేతలను చేర్చుకోవాలని నిర్ణయాలు జరిగిపోయాయని దానం చిట్ చాట్ లో పేర్కొన్నారు.
గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిసి వెళ్లారు. గ్రేటర్ ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో… పార్టీ మారిన దానం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వరకు రాకుండా… మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని అధికారికంగా కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకొని, కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది బీఆర్ఎస్. ఇప్పుడు అదే ఫార్మూలను అప్లై చేయబోతుంది కాంగ్రెస్.