కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్న సంగతి తెలిసిందే. రెండ్రోజులపాటు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొబోతున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కసరత్తు స్థానిక కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా ఆయనతో ఏయే అంశాలపై మాట్లాడించాలనే అంశంపై రాష్ట్ర నేతలు చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని రాహుల్ ప్రసంగం ఉండాలని భావిస్తున్నారట. తెలంగాణతో తెరాస అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారనీ, వీటిని బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షల వరకూ రుణాలు తాము ఇస్తామని రాహుల్ హామీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. తెలంగాణ క్యాబినెట్ లో మహిళలకు అవకాశం దక్కకపోవడాన్ని కూడా ప్రధానంగా రాహుల్ ప్రస్థావిస్తారని అంటున్నారు.
నిరుద్యోగ అంశాన్ని ప్రస్థావిస్తారనీ, తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారనీ, కానీ ఉన్న ఖాళీలను కూడా కేసీఆర్ సర్కారు భర్తీ చేయలేకపోయిందన్న అంశాన్నీ రాహుల్ మాట్లాడతారట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందనే హామీ ఇవ్వబోతున్నారట. దీంతోపాటు సెటిర్లను లక్ష్యంగా చేసుకుని రాహుల్ మాట్లాడే అవకాశాలున్నట్టు సమాచారం. సీమాంధ్రులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఆయన పర్యటించేలా పీసీసీ ఏర్పాట్లు చేస్తోందట. వీరితో వీలైతే ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయడం… ఆ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్ తో మాట్లాడించాలనీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఏపీ ప్రత్యేక హోదాపైనే ముందుగా సంతకం చేస్తారంటూ రాహుల్ ఇదివరకూ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు మైనారిటీలపై కూడా రాహుల్ పర్యటనలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందనీ అంటున్నారు.
నిజానికి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా ఆ మేరకు రాజకీయంగా ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. పోనీ, రాష్ట్ర నేతలు కూడా తెరాస వైఫల్యాలనుగానీ… కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఫలానాలా ఉంటుందన్న స్పష్టత కూడా ఇంతవరకూ ఇవ్వలేకపోయారు. అంతర్గత కుమ్ములాటలకే వారికి సమయం సరిపోవడం లేదని చెప్పాలి! కాబట్టి, రాహుల్ టూర్ నేపథ్యంలో తెలంగాణ విషయమై ఒక స్పష్టమై అజెండా, ఎన్నికల్లో ఇవ్వాల్సిన కీలక హామీలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి, రాహుల్ టూర్ మీద టి. కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకున్నట్టే ఉంది.