ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలన్నింటికీ వడ్డీలను తానే చెల్లిస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు.. గత ఏడాది డ్వాక్రా రుణాలపై సంఘాలు అన్నీ చెల్లించిన మొత్తం రూ. 1400 కోట్లను బ్యాంకు ఖాతాలకు విడుదల చేస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో డ్వాక్రా ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్ను నొక్కుతారు. ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 8.78 లక్షల సంఘాల్లో సభ్యులుగా వున్న 93 లక్షల మంది మహిళలకు సున్నావడ్డీ పథకం వల్ల లబ్ధి చేకూరనుంది. 2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పొదుపుసంఘాలు చెల్లించాల్సిన వడ్డీని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే చెల్లిస్తోంది. రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు జిల్లాల్లో బ్యాంకులు 7 శాతం, మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13.5 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ భారాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. వైయస్ఆర్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రతి పొదుపు సంఘంకు పూర్తి వడ్డీ రాయితీని మూడు లక్షల రూపాయల గరిష్ట రుణం పరిమితి వరకు వర్తింప చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో … ప్రతి డ్వాక్రా మహిళకు.. యాభై వేల రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఏడాది తర్వాత అని పెట్టారు. దాంతో. ఈ ఏడాది రుణమాఫీ చేస్తారని… డ్వాక్రా మహిళలు ఆశిస్తున్నారు. సున్నా వడ్డీ ింద… మూడు లక్షల గరిష్ట రుణ పరిమితి పెట్టడంతో… చాలా గ్రూపులు.. అనర్హతకు గురవుతాయన్న ఆందోళన ఉంది. ఈ దశలో ప్రభుత్వం రుణమాఫీని ప్రకటిస్తారని.. మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లలో… ఏడాదికి రూ. 12500 చొప్పున 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రుణమాఫీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అది ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంది.