బ్యాంకులు ఇటీవలి కాలంలో రూ. 68, 607 కోట్ల బడా పారిశ్రామికవేత్తల రుణాలను రైటాఫ్ చేశాయి. ఇవి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేసిన టాప్ -50కి చెందిన వారి జాబితా మాత్రమే. సమాచార హక్కు చట్టం కింద… ఆర్బీఐ నుంచి వచ్చిన సమాచారం మేరకు..ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వం కానీ.. ఆర్బీఐ కానీ ఈ వివరాలు స్వచ్చందంగా వెల్లడించలేదు. ఈ రుణాల రద్దు పొందిన వారి జాబితాలో నిరవ్ మోడీ మామ మోహుల్ చోక్సీ, బాబా రాందేవ్, విజయ్ మాల్యా సహా..అనేక మంది ప్రముఖులు ఉన్నారు. తెలుగు ప్రముఖులు కూడా తక్కువేం కాదు. డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి తీసుకున్న రూ. 1,915 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ బకాయి ఉన్న మొత్తంలో రూ. 1,790 కోట్లను బ్యాంకులు రద్దు చేశాయి. హైదరాబాద్కు చెందిన వీఎంసీ సిస్టమ్స్ అనే కంపెనీ రూ. 1,331 కోట్లను, కోస్టల్ ప్రాజెక్ట్స్కు చెందిన రూ. 984 కోట్లను బ్యాంకులు రద్దు చేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ ప్రాజెక్ట్స్కు చెందిన 835 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి.
రైటాఫ్ అంటే రుణమాఫీ కాదని ప్రభుత్వాలు..బ్యాంకర్లు.. ఆర్బీఐ చెబుతూ ఉంటాయి. సాంకేతికంగా రద్దు అన్నా, పద్దుల మార్పిడి అన్నా, రైటాఫ్ అన్నా వాస్తవంగా జరిగేది డిఫాల్టర్ల అప్పులు వసూలు చేయలేమని చేతులెత్తేయడమే. ఎగవేతదారులు హామీగా పెట్టిన ఆస్తులన్నింటినీ వేలం వేశాక, అన్ని మార్గాల్లో వసూలు చేశాక, ఇంకా బకాయిలు మిగిలితే, వసూళ్లకు వేరే మార్గం లేకపోతే ఆ బకాయిలను రైటాఫ్ చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. కానీ రుణాల రద్దు పొందిన వారిలో అత్యధికం.. సమాజంలో అత్యంత ధనికులుగా చెలామణి అవుతూ.. కోట్ల విలువ చేసే కార్లలో తిరిగే కుబేరులే. ఇతర కంపెనీల వ్యవహారాలను కోట్లలో డీల్ చేస్తూనే ఉంటారు. వీరి వద్ద నుంచి ఆర్బీఐ వసూలు చేయలేకపోయింది. వీరంతా రుణాలు తీసుకుని దారి మళ్లించారనడానికి ఆధారాలు కూడా ఉంటాయి. కానీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు.
లాక్డౌన్ కారణంగా సామాన్యులుకు మూడు నెలలు ఈఎంఐలు వాయిదా వేసుకునే చాన్సిచ్చిన ఆర్బీఐ.. ఆ మూడు నెలల వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపల్ ఎమౌంట్కు కలిపేసి… వసూలు చేయాలని కూడా సూచించింది. సామాన్యలెవరూ బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టేంత సాహసం చేయలేరు. బడా పారిశ్రామక వేత్తలు తీసుకున్న రుణాలే మొండి బకాయిలుగా మారాయి. కానీ బ్యాంకులు వీరి ఆస్తులను వేలం వేసే ఆలోచన కూడా చేయవు. ఈ కార్పొరేట్ కంపెనీ ఓనర్లు వారి దగ్గర డబ్బులు ఉన్నా కట్టరు.. కట్టించుకునే ప్రయత్నం చేయరు. విశేషం ఏమిటంటే.. వారికే బ్యాంకులు మళ్లీ మళ్లీ రుణాలు ఇస్తూంటాయి.