కేసీఆర్ రూ. లక్ష రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చి ఐదేళ్లలో చేయలేకపోయారు. కొద్దిగా చేశారు. మొదటి సారి గెలిచినప్పుడు కూడా రుణమాఫీ హామీ ఇచ్చారు. రెండు విడతలు కలిసి బీఆర్ఎస్ హయాంలో జరిగిన రుణమాఫీ కంటే.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చేసిన రుణమాఫీ రెట్టింపు. కానీ బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ పేరుతో ప్రభుత్వంపై చేస్తున్న దాడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడుతోంది. దీనికి కారణం ఏమిటంటే … సమాచారాన్ని గోప్యంగా ఉంచడమే.
30వేల కోట్ల రుణమాఫీ చేస్తామని రేవంత్ పదే పదే ప్రకటించారు. అన్నట్లుగా ఆయన రుణమాఫీని చేశారు. కానీ 30వేల కోట్లు కాదు. ఇరవై వేల కోట్ల లోపే. అంటే ఇంకా పది వేల కోట్లకుపైగా చేయాల్సి ఉంది. సాంకేతిక సమస్యల కారణంగా రుణమాఫీ కాలేదని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఉన్న వారితోనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి ?. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన సమాచారాన్ని ముందుగా బయట పెట్టాలి. రుణమాఫీ అవ్వాల్సిన రైతులకు సాంకేతిక సమస్యలను ప రిష్కరించి రుణమాఫీ చేస్తామని భరోసా ఇవ్వాలి. కానీ ఎంత మందికి రుణమఫీ చేయాల్సి ఉందో ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించే వరకూ స్పష్టతలేదు. దాదాపుగా ఇంకా పన్నెండు లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని ప్రకటించారు.
ప్రధానమంత్రి కూడా రుణమాఫీ చేయలేదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అయితే ఇలాంటి విమర్శలకు అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రణాళిక లేకపోవడం వల్లనే అనుకోవచ్చు. రుణమాఫీకి అర్హుల్ని ముందుగా ప్రకటించి… అర్హత లేని వాళ్లపై స్పష్టత ఇచ్చి రుణమాఫీ చేసి ఉంటే అసలు సమస్యలే వచ్చేవి కావని ఎక్కువ మంది అభిప్రాయం. ఇప్పుడు ఎలా లేదన్న రుణమాఫీ చేసినా సమాచారం దాచడం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.