తెలుగుదేశం ప్రభుత్వం మిగిలిపోయిన రెండు విడతల రుణమాఫీని విడుదల చేస్తూ.. జారీ చేసిన ఉత్తర్వులు, ఆర్థిక శాఖకు ఇచ్చిన ఆదేశాలను చాలా కాలం పాటు పెండింగ్‌లో పెట్టిన ప్రస్తుత ప్రస్తుతం… ఇప్పుడు వాటిని రద్దు చేసేసింది. వచ్చే నెల పదిహేనో తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నందున.. ఇక.. రైతులకు రుణమాఫీ వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రైతులందరికీ షాక్‌కి గురి చేసేదే. రుణమాఫీ హామీ పార్టీ పరంగా టీడీపీ ఇచ్చినప్పటికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని చట్టబద్ధం చేశారు. ఇప్పటికే.. గత సర్కార్‌లో రుణమాఫీకి సంబంధించి బడ్జెటరీ ప్రాసెస్ పూర్తి చేశారు. చెక్కులు కూడా జారీ అయి.. బడ్జెట్ ఆమోదం పొందింది.
అంతకు ముందే.. ప్రభుత్వం.. రుణవిమోచన పత్రాలు.. బాండ్లు ఇచ్చింది. వాటిని ప్రభుత్వం అంగీకరించి తీరాలి. అయితే ప్రభుత్వం మాత్రం… వాటి గురించి ఆలోచించకుండా.. రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు. ఆ పథకం కింద.. రెండు విడతలుగా పదిహేను వేలు రైతులకు అందేవి . కానీ జగన్ సర్కార్.. ఆ మొత్తాన్ని రూ. 12,500 గా నిర్ధారించింది. ఇప్పుడు.. ఆ మొత్తం నుంచి.. కేంద్రం.. రూ. ఆరు వేలు ఇస్తుందని చెబుతున్నారు. అంటే.. ఏపీ సర్కార్ ఇచ్చేది రూ. ఆరు వేలు ఐదు వందలు.
రైతు రుణమాఫీ రెండు కిస్తీలు విడుదల చేస్తే.. సంతోషపడేది రైతులే. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్.. వారికి లాభం కలిగించే చర్యలను ఎందుకు పక్కన పెడుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. టీడీపీ హామీ ఇచ్చింది.. చేయలేకపోయింది.. తాము వచ్చి చేశామని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. రుణమాఫీ అంశాన్ని.. పక్కన పెట్టేయడం.. రైతుల్లో వైసీపీ పై అసంతృప్తి పెరగడానికి కారణం అవుతోంది. ఇప్పుడు .. టీడీపీ ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూండటం.. వైసీపీకి ఇబ్బందికరమే.