వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రభుత్వం పేదల దగ్గర డబ్బుల వసూళ్లకు పెట్టిన స్కీం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. వినిపించడం లేదు. 1983 నుంచి పేదలకు ఇచ్చిన ఇళ్ల లబ్దిదారుల నుంచి ఇప్పుడు బాకీ పేరుతో డబ్బులు కట్టించుకునేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తు ఈ పథకం. ఒక్కొక్కరి దగ్గర నుంచి కనీసం రూ. ఇరవై వేలు కట్టించుకునేలా ప్లాన్ చేశారు. ఒక్కో ఇంటిపైకి వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగులు సలహా పది మంది వరకూ పంపేవారు. డబ్బులు కడితే రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని.. వాటిపై బ్యాంకులు లోన్లు ఇస్తాయని మభ్య పెట్టారు. భయపడిన వారు.. ఆశపడిన వారు అప్పులు చేసి మరీ తెచ్చి కట్టారు. కానీ ఇప్పుడు ఆ ఓటీఎస్ స్కీమ్ గురించి చప్పుడు లేదు.
ఎప్పటి ప్రభుత్వాలో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు అప్పు కట్టమని వేధించినా భరించిన పేదలకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి అందడం లేదు. అసలు ఈ ప్రక్రియే జరగడం లేదు . వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తారని చెప్పారు. ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో డబ్బులు కట్టిన వారు తమకు రిజిస్ట్రేషన్ పత్రాలివ్వాలని తిరుగుతున్నారు. గతంలో జగన్ మీట నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కొంత మందికి రిజిస్ట్రేషన్ పత్రాలిచ్చారు. వారికి బ్యాంకులు లోన్లివ్వడం లేదు. ఆ పత్రాలు చెల్లవని చెబుతున్నారు.
ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వారంతా నిరుపేదలే. రూ. ఇరవై వేలంటే వారికి చాలా పెద్ద మొత్తం. మామూలుగా వారు పేదలు.. కట్టలేరు అని ప్రభుత్వాలు కూడా మాఫీ జాబితాలో చేర్చేశాయి. కానీ రిజిస్ట్రేషన్లు, లోన్లు పేరుతో మభ్య పెట్టి వారిని మరింతగా అప్పుల ఊబిలోకి దింపేశారు. కానీ ఇప్పుడు .. మాత్రం పూర్తిగా మర్చిపోయారు. డబ్బులు కట్టిన వారికైనా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసివ్వాలని… బ్యాంకుల్లో లోన్లు ఇప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో ?