ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అనేకానేక ప్రచారాలు జరుగుతూ ఉండటంతో ప్రభుత్వం ఓ వివరణ పత్రాన్ని విడుదల చేసింది. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కువగా చేసి ఎదురుదాడి చేసినట్లుగా ఉంది కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి..? అన్న వివరాలు లేవు. అప్పులు ఎక్కువ చేయడానికి కరోనాను కారణంగా చెప్పుకొచ్చారు. చెప్పుకుంటే అప్పులు చేసుకోవడానికి లెక్కలేనన్ని కారణాలు దొరుకుతాయి. కానీ తీర్చే మార్గాలున్నప్పుడే అప్పులు చేయాలి. దివాలా తీయకుండా ఉంటే అప్పులు చేయాలి.కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా కనిపిస్తోంది.
వేల కోట్లలోనే చెల్లించాల్సిన బిల్లులు..!
ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్నా బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలోకి ఏపీసర్కార్ పడిపోయింది. కారణాలేమిటో ఎవరికీ తెలియదు కానీ ఆర్థికపరిస్థితి దారుణంగా ఉండటం వల్ల వాస్తవాలు బయట పెట్టడం ఇష్టంలేకనే బడ్జెట్ పెట్టలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. చెల్లింపుల కోసం ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిళ్లు..కోర్టుల్లో పడుతున్నకేసులు వంటివి చూస్తే.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇంకా క్లియర్ చేయాల్సిన బిల్లులువేల కోట్లలోనే ఉన్నట్లుగా తేలుతోంది. నిజానికి ఏ ఏడాది బిల్లులుఆ ఏడాది చివరికి క్లియర్ చేస్తారు. తర్వాత ఏడాదికి కొనసాగిస్తే బడ్జెట్‌పై భారం పడుతుంది. అలాంటిది ఏపీ సర్కార్ కనీసం నలభై వేల కోట్ల వరకూ పెండింగ్ బిల్లులను తర్వాత ఏడాదికి బదలాయించుకుంటోందని అంటున్నారు. ఇది మరో ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేని పనిగా నిపుణులు పేర్కొంటున్నారు.
తెచ్చిన అప్పులన్నీ ఏమైపోయాయి..!?
ప్రభుత్వం పదకొండు నెలల్లో కార్పొరేషన్ల ద్వారా కాకుండానే 79 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ సొమ్మంతా ఏంచేసిందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే బిల్లులేమీ పెద్దగా చెల్లించలేదని .. పెండింగ్‌లో ఉన్న భారీ బిల్లులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసిన పథకాలు… అమ్మఒడి ఒక్కటే నికరంగా ఇచ్చేది. రైతు భరోసాలోనూ సగం కేంద్రం భరిస్తుంది.మిగతా పథకాల్లో లబ్దిదారులు చాలా చాలాస్వల్పం. మరి ఏ పథకాలకు.. ఎలాఖర్చు పెట్టారో ఎవరికీ తెలియడం లేదు. ఈ ఖర్చుల వివరాలన్నీ వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో అభివృద్ధి పనుల మీద ఖర్చు పెట్టింది కూడా ఏమీలేదు. మౌలిక సదుపాయాల రంగంలో ఏపీలో గత రెండేళ్లలో ఖర్చు పెట్టలేదు. అందుకే ఇప్పుడు ఆదాయం కూడా పెరగలేదు.
అప్పులు పుట్టకపోతే చేతులెత్తేయాల్సిందే..!
ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్పుల మీదనే ఆధారపడే పరిస్థితి ఉంది.అప్పులు దొరక్కపోతే మాత్రం… ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కోవిడ్ ఇచ్చిన అవకాశాల వల్ల గత ఏడాది కొన్ని అప్పులు ఎక్కువ చేసుకోవడానికి కేంద్రం చాన్స్ ఇచ్చింది. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు. పైగా చెల్లింపులు కూడా ప్రారంభించాల్సి ఉంది. అప్పులకుచెల్లింపులు… రోజువారీ ఖర్చులు… సంక్షేమ పథకాలు… అభివృద్ధికి నిధులు … ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం… సామాన్యమైన విషయం కాదని చెబుతున్నారు. ఆర్థిక పరంగా ఏపీ సర్కార్ అత్యంత కఠినమైన పరిస్థితిని రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.