తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జూన్ చివరి వారంలోనే నిర్వహించాలనుకున్న రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో ఎన్నికలకు రెండు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో ఆ తర్వాతే ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సర్కార్ నుంచి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రకటన రాగానే ఎలక్షన్ కమిషన్ నుంచి షెడ్యూల్ విడుదల కానుంది.
స్థానిక సంస్థల ఎన్నికలను సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ఈ బాధ్యతను బీసీ కమిషన్ కు అప్పగించిన ప్రభుత్వం ఆ నివేదిక ప్రభుత్వానికి చేరాక లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఇందుకోసం సర్కార్ నుంచి బడ్జెట్ రిలీజ్ అయి వార్డుల వారీగా ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటికి వెళ్లి బీసీ ఓటర్ల లెక్కను సేకరించి ఫైనల్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి చేర్చాల్సి ఉంది.
ఏ కులం రాజకీయ వెనకబాటుకు గురైంది..? ఎక్కువ అవకాశాలు ఎవరికి దక్కాయి..? ఏ కులం వారు ఎక్కువగా స్థానిక ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు..? వీటన్నింటి లెక్క తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ అంశాలపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని, జూలై వరకు గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండటంతో ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నట్లు స్పష్టం అవుతోంది.